IND Vs ENG: రోహిత్‌, జడేజా సెంచరీలు.. తొలిరోజు భారీ స్కోరు

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  15 Feb 2024 6:00 PM IST
team india, england, third test match, cricket,

 IND Vs ENG: రోహిత్‌, జడేజా సెంచరీలు.. తొలిరోజు భారీ స్కోరు

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐదు టెస్టుమ్యాచ్‌ల సరీస్‌లో బాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. 1-1తో సమంగా కొనసాగుతున్నాయి. అయితే.. రాజ్‌కోట్ వేదికగా గురువారం మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయ్యింది. తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. తొలి సెషన్‌లో స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌.. రోహిత్‌ శర్మ నిలబడటంతో మంచి స్కోరు సాధించింది. రోహిత్‌ శర్మ 196 బంతుల్లో 131 పరుగులు చేశాడు. కెప్టెన్‌కు తోడుగా రవీంద్ర జడేజా కూడా రాణించాడు. 212 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లోనే సర్ఫరాజ్‌ఖాన్‌ ఇరగొట్టాడు. 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అలా తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 86 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ప్రస్తుతం జడేజాతో పాటు కుల్దీప్‌ యాదవ్ క్రీజులో ఉన్నాడు.

రాజ్‌కోట్‌ టెస్టులో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. అయితే.. ఆదిలోనే యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక నాలుగో ఓవర్లో తొలి వికెట్ కోల్పోగా.. వుడ్‌ మరో షాక్ ఇచ్చాడు. 9 బంతులను ఎదుర్కొన్న గిల్‌ ఒక్క పరుగు చేయకుండా పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగో స్థానంలో వచ్చిన పాటిదర్‌ 5 పరుగులు చేయగా.. అతన్ని హార్ట్‌లీ అవుట్ చేశాడు. దాంతో.. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కనిపించింది. కానీ.. కెప్టెన్ రోహిత్, జడేజా ఇద్దరు పట్టువిడవకుండా ఆడారు.. సెంచరీలు చేశారు. ఇక సర్ఫరాజ్‌ తాను ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అర్థ శతకం చేశాడు. అతని సత్తా చాటుకున్నాడు. 48 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ అందుకున్నాడు. రవీంద్ర జడేజా 99 పరుగుల వద్ద ఉండగా.. రన్‌ తీయబోయి నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో వుడ్‌ డైరెక్ట్ త్రోతో రన్‌ అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ రనౌట్ తర్వాత రెండో బంతికి జడేజా సెంచరీ చేశాడు. కాగా.. జడేజాకు టెస్టుల్లో ఇది నాలుగో శకతం. వుడ్‌ మూడు వికెట్లు తీయగా.. హార్ట్‌లీ ఒక వికెట్ పడగొట్టారు. తొలి సెషన్‌లో మూడు వికెట్లు పడిపోవడం తప్ప మూడో టెస్టు తొలి రోజులో టీమిండియానే ఆధిపత్యం కొనసాగించింది.

Next Story