టెస్టు క్రికెట్‌లో 150 వికెట్లు.. రికార్డుకెక్కిన జస్ప్రీత్‌ బుమ్రా

భారత్‌ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 Feb 2024 12:47 PM IST
team india, england, test match, cricket, bumrah record ,

టెస్టు క్రికెట్‌లో 150 వికెట్లు.. రికార్డుకెక్కిన జస్ప్రీత్‌ బుమ్రా

భారత్‌ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే.. రెండో టెస్టు మ్యాచ్‌ విశాఖ వేదికగా జరుగుతోంది. ఈ రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ అదరగొట్టాడు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ నడ్డీ విరిచాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఏకంగా 6 వికెట్లను పడగొట్టాడు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లను సైతం బుమ్రా వెనక్కి పంపేశాడు. అయితే.. బుమ్రా తాజాగా తీసిన 6 వికెట్లతో టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు.

విశాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన జస్ప్రీత్‌ బుమ్రా తన టెస్టు కెరీర్‌లో మొత్తం 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో 34 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 64 ఇన్నింగ్స్‌ల్లో 20.29 సగటు రేటుతో 152 వికెట్లను తీసుకున్నాడు. తద్వారా అరుదైన ఘనత తన పేరున లిఖించుకున్నాడు. గత 110 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మెరుగైన సగటు రేటుతో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

కాగా..ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలాన్ డేవిడ్సన్ పేరిట ఉండేది. 1953-1963 మధ్య కాలంలో డేవిడ్సన్ 20.53 సగటు రేటుతో 150 వికెట్లు తీశాడు. తాజాగా విశాఖలో జరిగిన ఇంగ్లండ్‌ టెస్టులో ఆ రికార్డును బుమ్రా బ్రేక్‌ చేశాడు. 1950 కంటే ముందు ఇంగ్లండ్‌ లెజెండరీ పేసర్ సిడ్నీ బర్న్స్‌ (1901-1974 కాలంలో ) 16.43 సగటుతో 150 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇదొక్కటే కాదు.. మరో ఘనత కూడా బుమ్రా అకౌంట్‌లో చేరిపోయింది. అతి తక్కువ బంతుల్లోనే 150 టెస్టు వికెట్లు సాధించిన భారత తొలి బౌలర్‌గా అవతరించాడు బుమ్రా. 6,781 బంతుల్లో 150 వికెట్లు తీయగా.. వెటరన్‌ పేసర్ ఉమేశ్ యాదవ్ (7661 బాల్స్‌ )ను బుమ్రా అధిగమించాడు.

Next Story