IND Vs ENG: జైస్వాల్ స్మాష్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ కొట్టేశాడు..
భారత్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 10:20 AM ISTIND Vs ENG: జైస్వాల్ స్మాష్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ కొట్టేశాడు..
భారత్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. విశాఖ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్మాష్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకరి తర్వాత ఒకరు వచ్చినవారు వచ్చినట్లు ఔట్ అవుతున్నా.. ఈ యంగ్ ప్లేయర్ మాత్రం నిలకడగా ఆడాడు. 277 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. విశాఖ టెస్టులో మొదటి రోజు ఆధిక్యాన్ని కనబర్చిన భారత్.. రెండో రోజు ఆట ప్రారంభించిన కాసేపటికే ఒక వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన అశ్విన్ కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే.. యశస్వి జైస్వాల్ మాత్రం రాణిస్తున్నాడు. డబుల్ సెంచరీకి ముందే వరుసగా సిక్స్.. ఫోర్ బాది ఈ మార్క్‌ను అందుకున్నాడు. అంతకు ముందు కూడా హాఫ్ సెంచరీ, సెంచరీకి ముందు సిక్స్, ఫోర్‌తోనే మార్క్‌ను అందకున్నాడు. కాగా.. జైశ్వాల్‌కు కెరీర్‌లో ఇది తొలి డబుల్ సెంచరీ.
విశాఖలో జరుగుతోన్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలిరోజు ఆట పూర్తయ్యే సమయానికి 93 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. అందులో ఒక్క జైస్వాలే 179 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు అశ్విన్ మరో 15 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇక మొదటి టెస్టు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఇందులో భారత్ ఓటమిని చూసింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఇండియా తరఫున మరోవైపు అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన వారి లిస్ట్‌లో జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లో వినోద్ కాంబ్లీ ఉన్నాడు. 21 ఏళ్ల 32రోజుల వయసులో ఇంగ్లండ్‌పై వాంఖడే వేదికగా 1993లో 224 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ అదే సంవత్సరంలో జింబాబ్వేపై ఢిల్లీ వేదికగా 227 పరుగులు చేశారు. ఆయన తర్వాత స్థానంలో సునీల్ గవాస్కర్ 21 ఏళ్ల 277 రోజుల వయసులో 1971లోనే 220 పరుగులు చేయగా.. తాజగా 22 సంవత్సరాల 36 రోజుల వయసులో విశాఖ వేదికగా జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. అంటే 1993 తర్వాత అతి తక్కువ వయసులోనే డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు యశస్వీ జైస్వాల్.