టీమ్ ఇండియా క్రికెటర్, తెలుగోడు తిలక్ వర్మ చరిత్ర సృష్టించారు. టీ20ల్లో రెండు డిస్మిసల్స్ మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. తన చివరి నాలుగు మ్యాచుల్లో ఔట్ కాకుండా తిలక్ 318 పరుగులు బాదారు. ఈ క్రమంలో మార్క్ చాప్‌మన్ (271) రికార్డును ఆయన బద్దలు కొట్టారు. సౌతాఫ్రికాపై 107, 120, ఇంగ్లండ్‌పై 19, 72 రన్స్ చేశారు. ఈ నాలుగు ఇన్సింగ్సుల్లోనూ ఆయన నాటౌట్‌గా నిలవడం విశేషం.
నిన్న ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన టీ20 మ్యాచ్ దాదాపు చేజారిందనుకున్న సమయంలో తిలక్ వర్మ అదరగొట్టారు. మిగతావారు ఔట్ అవుతున్నా ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. తప్పుడు షాట్లు ఆడలేదు. హాఫ్ సెంచరీ పూర్తయినా సెలబ్రేషన్ చేసుకోలేదు. చివరికి మరో 4 బంతులు ఉండగానే భారత్‌కు విజయం అందించి అప్పుడు గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా చెలరేగి రెండో విజయాన్ని భారత్ ఖాతాలో చేర్చారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 165 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు అభిషేక్ (12), శాంసన్ (5)తో పాటు కెప్టెన్ సూర్య (12) కూడా విఫలమయ్యారు. తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో భారత్ 2 వికెట్ల తేడాతో గెలిచింది.