IND Vs BAN: ధోనీని సమం చేసిన రిషబ్‌ పంత్

టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  21 Sept 2024 2:47 PM IST
IND Vs BAN: ధోనీని సమం చేసిన రిషబ్‌ పంత్

టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. చెన్నై ఏవదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత్‌ అద్భుతంగా రాణిస్తోంది. ఫస్ట్‌ ఇన్నింగ్స్ లో అశ్విన్‌ సెంచరీతో అదరగొడితే.. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, వికెట్‌ కీపర్ రిషబ్‌ పంత్ రాణించారు. రిషబ్‌ పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇక శుభ్‌మన్‌ గిల్‌ కూడా సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో రిషబ్‌ పంత్‌కు ఆరో శతకం కాగా.. శుభ్‌ మన్‌ గిల్‌ ఐదో సెంచరీ చేశాడు. 124 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు రిషబ్.

అయితే.. ఆ తర్వాత బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీకే రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వడంతో పెవిలియన్‌కు చేరాడు. దాంతో.. గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని ఇచ్చినట్లు అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌తో గిల్‌ నిరాశపరిచాడు. కానీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. బంగ్లాపై 158 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. రిషబ్‌ పంత్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ 19 బంతులు ఎదుర్కొని 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో.. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ముందు ఇప్పుడు 515 పరుగుల భారీ లక్ష్యం ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

మరోవైపు ఈ శతకం ద్వారా రిషబ్ పంత్ మరో ఘనతను అందుకున్నాడు. వికెట్ కీపర్లలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో మాజీ ఆటగాడు ధోనీని రిషబ్‌ పంత్ సమం చేవాడు. అయితే.. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు చేయగా.. పంత్‌ మాత్రం 58 ఇన్నింగ్సుల్లోనే ఆరు సెంచరీలు నమోదు చేశాడు.

Next Story