చిన్న గాయాలైతే IPLలో ఆడతారు.. భారత్‌ తరఫున ఆడలేరా?: కపిల్ దేవ్

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  31 July 2023 7:26 AM GMT
Team India, Cricket, Kapil dev, Comments,

చిన్న గాయాలైతే IPLలో ఆడతారు.. భారత్‌ తరఫున ఆడలేరా?: కపిల్ దేవ్

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత క్రికెటర్లు అన్నీ తమకే తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. ఎవరి సలహాలు అడగరని ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టీమిండియా సీనియర్ ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలై టీమ్‌కు దూరంగా ఉంటున్నారు. దాంతో.. టీమ్‌ ప్రదర్శనపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే ఆటగాళ్ల నిబద్ధతపై కపిల్‌ దేవ్‌ విమర్శలు చేశారు.

ఐపీఎల్‌లో అయితే.. చిన్నపాటి గాయాలు అయినా పట్టించుకోరని అలాగే మ్యాచ్‌లు ఆడుతారని అన్నారు కపిల్. అదే గాయంతో భారత్‌ తరఫున ఆడాల్సి వస్తే మాత్రం విశ్రాంతి తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారని కపిల్‌ దేవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ కపిల్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గాయం కారణంగా ఏడాది నుంచి టీమిండియా తరఫున స్టార్ ఫేసర్ బుబ్రా ఆడటం లేదు. త్వరలో రానున్న వన్డే ప్రపంచ కప్‌ నాటికి అతను సిద్ధం కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు కపిల్. బుమ్రాకు అసలు ఏమైందని ప్రశ్నించాడు. ఒక వేళ బుమ్రా వరల్డ్‌ కప్‌ నాటికి పూర్తిస్థాయిలో కోలుకోలేక పోతే.. అతని గురించి సమయం వెచ్చిచండం వృథానే అవుతుందని అన్నారు. ఇక రిషబ్‌ పంత్‌ గురించి కూడా ప్రస్తావించారు కపిల్ దేవ్. అతనొక గొప్ప క్రికెటర్‌ అని.. అతడు ఉంటే ఇటీవల టీమిండియా ఆడిన టెస్ట్‌ ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు. రాహుల్‌ కూడా గాయం కారణంగా టీమిండియాకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కపిల్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఐపీఎల్‌ గురించి మాట్లాడిన కపిల్ దేవ్‌.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గొప్పదే అన్నారు. అయితే.. దాంట్లో చిన్న గాయాలు అయినా ప్లేయర్లు ఆడతారని.. కానీ అదే పరిస్థితి టీమిండియాలో ఉన్నప్పుడు ఎదురైతే దూరంగా ఉంటున్నారని అన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. దీనిని తాను చాలా ఓపెన్‌గా చెబుతున్నానని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. సీనియర్లను దృష్టిలో పెట్టుకునే కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారత జట్టు ఇటీవల వెస్టిండీస్‌తో రెండు వన్డేలు ఆడింది. ఆ రెండు మ్యాచుల్లోనూ భారత్‌ జట్టు ప్రయోగాలు చేసింది. మొదటి మ్యాచ్‌లో ఎలాగోలా గెలిచినా.. రెండో వన్డేలో మాత్రం ఓడిపోయింది. దాంతో.. టీమిండియా చేస్తున్న ప్రయోగాలపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌ కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది.. ఇలా ఆడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు క్రికెట్‌ అభిమానులు.


Next Story