సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో ఓటమిపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 11:25 AM ISTసౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో ఓటమిపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
సౌతాఫ్రికాతో టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై సౌతాఫ్రికా గెలిచింది. దాంతో.. సౌతాఫ్రికా 1-0తో టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతేకాదు.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ మూడో సీజన్ పట్టికలోనూ దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. కాగా.. టీమిండియా మాత్రం ఐదో స్థానానికి పడిపోయింది. కాగా.. తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
సౌతాఫ్రికాలోని సెంచూరియన్ గ్రౌండ్‌లో తొలి టెస్టు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ పిచ్ 400 పరుగులు చేయడానికి వీలుగా ఉండేది కాదు అని రోహిత్ అన్నారు. తమ బౌలింగ్ పేలవంగా ఉందనీ పేర్కొన్నారు. అయితే.. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా రాణించారనీ చెప్పారు. తాము ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదని.. అతడికి మద్దతు అవసరమని చెప్పాడు రోహిత్. మిగతా ముగ్గురు పేసర్లూ తమ పాత్రలను పూర్తిస్థాయిలో పోషించాలని చెప్పాడు. బుమ్రా మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడనీ అన్నాడు రోహిత్. అయితే.. మిగతావారు కూడా కష్టపడ్డారు కానీ.. ఆశించిన ఫలితం రాలేదన్నాడు. ఈ ఓటమి నుంచి తప్పకుండా మంచి గుణపాఠం నేర్చుకుంటామని రోహిత్ శర్మ అన్నాడు. లోటుపాట్లను సవరించుకుని రెండు టెస్టుకు సిద్ధం అవుతామని చెప్పాడు.
టీమిండియా టెస్టు జట్టులో ఉన్నవారు అత్యుత్తమ ఆటగాళ్లని చెప్పాడు రోహిత్ శర్మ. అలాగే ప్రసిధ్ కృష్ణ ఇప్పుడే టెస్టుల్లోకి అడుగుపెట్టాడనీ.. అతను ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రసిధ్‌పై తమకు నమ్మకం ఉందనీ.. ఆటకు పదునుపెట్టాలని చెప్పాడు. ఇక సౌతాఫ్రికా జట్టులోనూ ముగ్గురు పేసర్లు గెరాల్డ్, బర్గర్, జాన్‌సెన్‌కు రెడ్‌బాల్ క్రికెట్ ఆడిన అనుభవం లేదనీ.. కానీ వారు పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని బాగా రాణించారని చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కెరియర్ ఆరంభంలో ఇలాంటివి సాధారణమని చెప్పాడు. అయితే.. రెండు ఇన్నింగ్సుల్లో టీమిండియా బ్యాటింగ్ దారుణంగా ఉందని రోహిత్ అన్నాడు. ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ చూపించాడనీ.. కానీ తాము అలా ఆడలేకపోయామని అన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.