శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ ఆసక్తికర కామెంట్స్

శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2024 11:45 AM IST
team india, captain rohit sharma,  sri lanka, odi series ,

 శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ ఆసక్తికర కామెంట్స్

టీమిండియా శ్రీలంక టూర్‌లో ఆ జట్టును టీ20 మ్యాచుల్లో మట్టి కరిపించింది. పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత వన్డే సరీస్‌ను కూడా దక్కించుకుంటుందని భావించారు. కానీ.. టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక గెలుచుకుంది. ఈ మ్యాచుల్లో ఒకటి టైగా ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడో వన్డేలో భారత బ్యాటర్లు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శ్రీలంక బౌలర్ల స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే.. దీనిపై ఆందోళన అక్కర్లేదన్నాడు. కొన్ని అంశాలపై తాము తీవ్రంగా దృష్టి సారిస్తామని చెప్పాడు. ఈ సిరీస్‌ సందర్బంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు రోహిత్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌ నెగ్గిన తర్వాత అత్మసంతృప్తితో ఉన్నామనేది జోక్‌ మాత్రమే అంటూ విమర్శలను కొట్టి పారేశాడు. కెప్టెన్‌గా తాను ఉన్నంత కాలం తనకు విజయదాహం ఏమాతరం తీరదని అన్నాడు. అయితే.. వన్డే సిరీస్‌లో శ్రీలంక టీమ్‌ చాలా బాగా ఆడిందని కొనియాడారు. పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలనే విషయం ఈ సిరీస్‌ ద్వారా తెలుసుకున్నామని.. ఇంకా మెరుగవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ఇక ఈ సిరీస్‌తో ప్రపంచం ముగిసిపోదు.. టీమిండియా ఆటగాళ్లు నిలకడైన ఆటతీరును కొనసాగిస్తారని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

కాగా.. భారత్‌ 27 ఏళ్ల తర్వాత శ్రీలంకపై ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. చివరిసారిగా 1997లో టీమిండియాపై శ్రీలంక సిరీస్‌ను గెలిచింది. భారత్‌ పై ఒకే వన్డేలో స్పినర్లు మాత్రమే అత్యధిక వికెట్లు తీయడం ఇది ఐదోసారి కావడం విశేషం. గరిష్ఠంగా 3 వన్డేల సిరీస్‌లో స్పిన్నర్లకే 27 వికెట్లు దక్కాయి.

Next Story