కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేరు. ఆదివారం నాడు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో నిర్వహించారు. ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు. పునీత్ రాజ్ కుమార్ లేడనే చేదు నిజాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే హీరో విశాల్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. అంతేకాకుండా పునీత్ ఇచ్చిన మాటకు తాను అండగా ఉంటానని చెప్పడంతో ప్రతి ఒక్కరూ విశాల్ ను మెచ్చుకుంటూ ఉన్నారు.
ఇంతకూ విశాల్ ఇచ్చిన మాట ఏమిటో తెలుసా..? పునీత్ రాజ్ కుమార్ ఇప్పటి వరకు చదివిస్తున్న 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని విశాల్ మాట ఇచ్చాడు. పునీత్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని, ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారని.. ప్రతి ఒక్కరినీ ఎంతగానో గౌరవించే వారని విశాల్ అన్నారు. సమాజానికి పునీత్ ఎంతో చేశారని.. ఎంతోమందికి ఉచిత విద్యను అందించడంతోపాటు వృద్ధాశ్రమాల్ని కూడా ఏర్పాటు చేశారని అన్నారు.
ఒకే ఒక్క మనిషి ఇన్ని పనులు చేశాడంటే నమ్మలేకున్నానని, ఇప్పటి వరకు ఆయన చదివించిన 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని మాట ఇచ్చారు విశాల్. 'ఎనిమి' సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, చివరికి తన కళ్లను కూడా దానం చేశారని విశాల్ గుర్తు చేశారు. విశాల్ ఇచ్చిన మాటకు ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు.