క‌రోనా పాజిటివ్ అని తేలినా.. భార‌త్‌తో ఫైన‌ల్ మ్యాచ్ ఆడింది.. దుమ్మెత్తిపోస్తున్న నెటీజ‌న్లు

Tahlia McGrath plays CWG final despite testing positive for Covid-19.కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళ‌ల క్రికెట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 8:55 AM GMT
క‌రోనా పాజిటివ్ అని తేలినా.. భార‌త్‌తో ఫైన‌ల్ మ్యాచ్ ఆడింది.. దుమ్మెత్తిపోస్తున్న నెటీజ‌న్లు

కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ర‌త‌జంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా 9 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి స్వ‌ర్ణం కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈమ్యాచ్‌లో ఆస్ట్రేలియా చీటింగ్ చేసిందంటూ సోష‌ల్ మీడియాలో వేదిక‌గా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం కొవిడ్ పాజిటివ్ అని తేలిన ఆటగాళ్లు జ‌ట్టుకు దూరంగా ఉంటూ ఐసోలేష‌న్‌లో ఉండాలి. అయితే.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ తహ్లియా మెక్‌గ్రాత్ మాత్రం ఏకంగా ఫైన‌ల్ మ్యాచ్ ఆడేసింది. అస‌లు ఆమెను మ్యాచ్‌ను ఎలా ఆడ‌నిచ్చారు అంటూ అభిమానులు మండిప‌డుతున్నారు.

క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి..

ఓ క్రికెటర్‌కు కొవిడ్ పాజిటివ్ అని తెలిసినా మ్యాచ్ ఆడించ‌డం క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. అస‌లేం జ‌రిగిందంటే.. మ్యాచ్ రోజు ఉద‌యం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో మెక్‌గ్రాత్‌కు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె మ్యాచ్ కు దూరం కాక‌త‌ప్ప‌ద‌ని అంతా అనుకున్నారు. అయితే.. లక్ష‌ణాలు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ అనుమ‌తి కోరింది క్రికెట్ ఆస్ట్రేలియా. దీనిపై మ్యాచ్ రిఫ‌రీ, అధికారులు తీవ్రంగా చ‌ర్చింరు. చివ‌రకు కొన్ని ష‌ర‌తుల‌తో అనుమ‌తి ఇచ్చారు. దీంతో టాస్ సైతం 12 నిమిషాలు ఆల‌స్య‌మైంది.

మ్యాచ్ ఆరంభ స‌మ‌యంలో జ‌ట్టు స‌భ్యులు జాతీయ గీతం అల‌పించిన‌ప్పుడు మెక్‌గ్రాత్ వాళ్ల‌కు కొంచెం దూరంగా ఉంది. అలాగే ఆసీస్ బ్యాటింగ్ స‌మ‌యంలోనూ డ‌గౌట్‌లో స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌కు దూరంగా కూర్చొని ఉంది. కాగా.. బ్యాటింగ్ చేసే స‌మ‌యంలో ఆమె మాస్కును ధ‌రించ‌లేదు. నాలుగు బంతులు ఆడిన మెక్‌గ్రాత్ రెండు ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరింది. బౌలింగ్‌లో రెండు ఓవ‌ర్లు వేసి 24 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు.

క్లినికల్ స్టాఫ్ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ మ్యాచ్ అధికారులతో సంప్రదించిన తర్వాతే ఆమెను మ్యాచ్‌ బరిలోకి దింపామని క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ ఇచ్చినప్పటికీ నెటిజ‌న్లు మాత్రం అలా ఎలా ఆడనిస్తారు అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అందుకే ఆడించారా..?

తహ్లియా మెక్‌గ్రాత్ ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు చేసింద‌. బౌలింగ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టింది. అలాగే నూజీలాండ్‌తో జ‌రిగిన కీల‌క‌మైన సెమీస్‌లో మ్యాచ్‌లో సైతం మెక్‌గ్రాత్ రాణించింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన మెక్‌గ్రాత్‌, బ్యాటింగ్ లో 23 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. పుల్ ఫామ్‌లో ఉండ‌బ‌ట్టే కొవిడ్ సోకినా స‌రే ఫైన‌ల్‌లో ఆమెను ఆడించాల‌ని ఆసీస్ మేనేజ్‌మెంట్ బావించిన‌ట్లు తెలుస్తోంది.

Next Story