టీ20 వరల్డ్‌ కప్: నేడే ఐర్లాండ్‌తో భారత్‌ మ్యాచ్

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ కొనసాగుతోంది. ఇవాళ భారత్‌ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ఆడబోతుంది.

By Srikanth Gundamalla  Published on  5 Jun 2024 8:14 AM IST
t20 world cup, india vs irland, cricket ,

టీ20 వరల్డ్‌ కప్: నేడే ఐర్లాండ్‌తో భారత్‌ మ్యాచ్

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ కొనసాగుతోంది. ఇవాళ భారత్‌ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ఆడబోతుంది. గ్రూప్‌-ఎలో భాగంగా ఐర్లాండ్‌ను టీమిండియా ఢీకొనబోతుంది. న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఐర్లాండ్‌ చిన్న జట్లలోనే పెద్ద జట్టు అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న జట్లకూ ఈ టీమ్‌ షాక్‌లు ఇచ్చింది. కాబట్టి చిన్న జట్టు అనే ఆలోచన కాకుండా.. రోహిత్‌ సేన తన స్థాయికి తగ్గట్లుగా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.

మరోవైపు ఇటీవల టీమిండియా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌ ఆడింది. దాంతో.. భారత్‌ ఆటగాళ్లకు ప్రాక్టీస్ దక్కినట్లు అయింది. స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌లో పరుగుల వరదను పారించాడు. ఇక రోహిత్‌, విరాట్‌ ఓపెనర్లుగా వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజం అయితే మంచి ఆరంభం లభిస్తుందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్‌ దిగుతాడని తెలుస్తోంది. ఆ తర్వాత సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యాలు వచ్చే చాన్స్ ఉంది. స్పిన్‌ పిచ్‌ కాబట్టి ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆడుతారు. పేస్‌ కోటా బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్ ఆడుతారు. స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అయితే సిరాజ్‌స్థానంలో చాహల్‌ కూడా ఆడే చాన్స్‌లు ఉన్నాయి.

వన్డే ప్రపంచకప్‌ 2011లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఐర్లాండ్‌ సంచలనం సృస్టించింది. అందుకే అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ ఆ జట్టును తేలిగ్గా తీసుకోవట్లేదు. టీ20ల్లో ఎక్కువగా ఆల్‌రౌండర్లతో నిండిన ఐర్లాండ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే.

టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లీ, శాంసన్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్‌/చహల్.

ఐర్లాండ్‌ తుది జట్టు అంచనా:బాల్‌బిర్నీ (కెప్టెన్‌), స్టిర్లింగ్, టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్, మెకార్తీ, యంగ్, వైట్‌.

Next Story