T20 World Cup: ఇక ఒకే మ్యాచ్‌.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు భారత్‌

భారీ పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న భారత్ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది.

By Srikanth Gundamalla  Published on  28 Jun 2024 1:09 AM GMT
t20 world cup, india,  final, england,

T20 World Cup: ఇక ఒకే మ్యాచ్‌.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు భారత్‌  

టీ20 వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీ చివరి దశకు వచ్చేసింది. రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గత 2022 పరాభవానికి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. భారీ పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుని ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. ఇక పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడటానికి మరో మ్యాచ్‌ దూరంలో మాత్రమే ఉంది. గురువారం అర్ధరాత్రి వరకు ఇంగ్లండ్, భారత్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్‌ ఏకపక్షంగానే సాగింది. మొదట్నుంచి భారత్‌ పైచేయి సాధిస్తూనే వచ్చింది. 68 పరుగుల తేడాతో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను టీమిండియా ఓడించింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి రాణించారు.

సెమీ ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలై.. కొన్ని విరామాలను తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్ మూడు వికెట్లు, రీస్‌ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్‌ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసుకున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. ఏ క్షణంలో కూడా ఇంగ్లండ్‌ చేతిలో మ్యాచ్‌ ఉన్నట్లు కనిపించలేదు. భారత్‌ స్పిన్నర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు చేరారు ఇంగ్లండ్ బ్యాటర్లు. జోస్ బట్లర్ 23, హ్యారీ బ్రూక్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా ఉన్నారు. ఫిల్ స్టాల్ 5, మెయిన్ అలీ 8, జానీ బెయిర్‌ స్టో డకౌట్, సామ్‌ కరణ్ 2, లివింగ్ స్టోన్ 11, క్రిస్‌ జోర్డాన్ 1 పరుగు మాత్రమే చేసి విఫలం అయ్యారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. బుమ్రా రెండు వికెట్లను పడగొట్టాడు.

ఇక ఈ విజయంతో ఇంగ్లండ్‌పై టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. గత టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఇదే ఇంగ్లండ్‌ టీమిండియాను ఓడించింది. ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసి భారత్ ఫైనల్ కు చేరింది. శనివారం వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. మొదటి సెమీస్ మ్యాచ్‌లో అప్ఘాన్‌ను ఘోరంగా ఓడించి సౌతాఫ్రికా ఫైనల్‌కు వచ్చిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను గెలవాలని భారత్.. తొలిసారి వరల్డ్ కప్‌ ట్రోఫీని ముద్దాడేందుకు సౌతాఫ్రికా టీమ్‌లు ఎదురుచూస్తున్నాయి.

Next Story