టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్.. అహ్మదాబాద్‌లో రద్దీ దృష్ట్యా ప్రత్యేక విమానాలు ఏర్పాటు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న (ఆదివారం) జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది.
By - అంజి |
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్.. అహ్మదాబాద్‌లో రద్దీ దృష్ట్యా ప్రత్యేక విమానాలు ఏర్పాటు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న (ఆదివారం) జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో భారత్ తలపడనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు మరియు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి అహ్మదాబాద్‌కు అదనపు సర్వీసులను ప్రకటించింది.
ఆకాశ ఎయిర్ కూడా ముంబై-అహ్మదాబాద్ మధ్య మార్చి 8, 9 తేదీల్లో ప్రత్యేక డైరెక్ట్ ఫ్లైట్లను నడపనుంది. విమానంలో ప్రయాణిస్తూనే లైవ్ స్కోర్ అప్‌డేట్స్ చూసేలా 'SkyScore' ఫీచర్‌ను ఆకాశ ఎయిర్ అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా, ప్రయాణికులకు క్రికెట్ పండుగ వాతావరణాన్ని కలిగించేలా విమానం లోపల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వెస్ట్రన్ రైల్వే ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య మార్చి 8న ప్రత్యేక చార్జీలతో రెండు స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
హోరాహోరీగా ఫైనల్ పోరు:
భారత్ సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ముఖ్యంగా సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 254 పరుగుల భారీ స్కోరు సాధించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. సొంత గడ్డపై టైటిల్‌ను కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు, సెమీస్‌లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ కూడా ఫుల్ ఫామ్‌లో ఉంది. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్‌ల విధ్వంసకర బ్యాటింగ్‌తో కివీస్ తమ తొలి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలని భావిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షకు పైగా ప్రేక్షకుల మధ్య ఈ తుది పోరు జరగనుంది.