టీ20 వరల్డ్‌ కప్‌లో సంచలనం.. ఆసీస్‌పై అప్ఘాన్‌ విజయం

టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో సంచలనం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  23 Jun 2024 10:56 AM IST
t20 world cup, Australia vs Afghanistan, cricket,

టీ20 వరల్డ్‌ కప్‌లో సంచలనం.. ఆసీస్‌పై అప్ఘాన్‌ విజయం 

టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో సంచలనం చోటుచేసుకుంది. అప్ఘానిస్థాన్‌ జట్టు రికార్డును క్రియేట్ చేసింది. రషీద్‌ ఖాన్‌ నేతృత్వంలోని ఈ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్‌ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అప్ఘాన్ టీమ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 60 పరుగులు చేశాడు. ఇబ్రీం జద్రాన్ 51 స్కోర్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. గుల్బాదిన్ నైబ్‌ అద్భుతమైన స్పెల్ వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అప్ఘానిస్థాన్ జట్టు 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ఒకానొక క్రమంలో ఆస్ట్రేలియా 32 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్‌తో కలిసి గ్లెన్ మాక్స్‌వెల్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టోయినిస్‌ను అవుట్ చేయడం ద్వారా నాయబ్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఇక్కడి నుంచి మ్యాచ్‌ పూర్తిగా మారిపోయింది. మ్యాక్స్‌వెల్ మినా ఏ ఆటగాడు 15 స్కోరును తాకలేదు. ట్రావిస్ హెడ్ (0), డేవిడ్ వార్నర్ (3), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12), మార్కస్ స్టోయినిస్ (11), టిమ్ డేవిడ్ (2), మాథ్యూ వేడ్ (5), పాట్ కమిన్స్ (3), అష్టన్ అగర్ (2) మరియు ఆడమ్ జంపా (9) పరుగులు చేశారు.

పాట్‌ కమిన్స్‌ రికార్డు

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ రికార్డును నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సార్లు హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా అవతరించాడు. హ్యాట్రిక్ కారణంగా ఆస్ట్రేలియా పునరాగమనం చేసినా.. చివరకు అప్ఘాన్ చేతిలో ఓటమి పాలైంది. ఆసీస్‌పై అప్ఘాన్ విజయంతో సెమీఫైనల్‌ పోరు ఉత్కంఠగా మారనుంది. గ్రూప్‌-1లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, అప్ఘాన్‌లు రెండేసి పాయింట్లతో ఉన్నాయి. ఆస్ట్రేలియా తన చివరి సూపర్ -8 మ్యాచ్‌ భారత్‌తో ఆడుతుంది. అప్ఘానిస్థాన్ బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

Next Story