టీ20 వరల్డ్‌ కప్‌ భారత్‌దే.. ఫైనల్‌లో ఉత్కంఠ విజయం

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో భారత్‌ అదరహో అనిపించింది.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2024 6:42 AM IST
t20 world cup 2024, champions, india, cricket ,

టీ20 వరల్డ్‌ కప్‌ భారత్‌దే.. ఫైనల్‌లో ఉత్కంఠ విజయం

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో భారత్‌ అదరహో అనిపించింది. ఒక్క ఓటమిని కూడా చూడకుండా కప్‌ను సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఎఫర్ట్‌ను పెట్టి.. గెలిచే వరకూ పోరాడారు. ఏడు నెలల కిందటే వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో పరాభవం గుర్తొచ్చింది. కానీ.. చివరి మూడు ఓవర్లలో మ్యాజిక్ చేశారు. వరుసగా వికెట్లు తీయడం.. పరుగులను కట్టడి చేశారు. 7 పరుగుల తేడాతో విజయం సాధించడంతో కప్‌ భారత్‌ సొంతమైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ముగిసింది. ఇక కప్‌ భారత్‌ గెలవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి దేశంలో పటాకులు పేలుస్తూ టీమిండియా క్రికెట్‌ అభిమానులంతా సందడి చేశారు.

అయితే.. దక్షిణాఫ్రికాపై ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పెద్ద స్కోర్‌ చేస్తారని భావించినా.. మొదట్లో వరుస వికెట్లు పడ్డాయి. రోహిత్, పంత్, సూర్య వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. దాంతో.. ఇది లో స్కోరింగ్ మ్యాచ్‌ అవుతుందని భావించారు. కానీ.. విరాట్ కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్‌ స్కోర్‌ను పరుగెత్తించాడు. 47 పరుగుల వ్యక్తి గత స్కోర్‌ వద్ద అనూహ్యంగా రన్‌ఔట్‌ అయ్యాడు. ఇక శివమ్‌ దూబె ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు షాట్స్‌ ఆడాడు. విరాట్‌ కోహ్లీ తొలుత మెల్లిగానే ఇన్నింగ్స్‌ను ఆడాడు. కానీ.. హాఫ్‌ సెంచరీ దాటిన తర్వాత చివరి ఓవర్లలో దంచికొట్టాడు. వరుసగా ఫోర్లు.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ.. 76 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 19వ ఓవర్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. తక్కువ స్కోర్‌ చేస్తారని భావించిన టీమిండియా.. 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగలిగింది.

ఇక 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా మొదటి 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయినా.. స్కోరు బోర్డును మాత్రం ముందుకు తీసుకెళ్లింది. 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 151 పరుగులు చేసింది. విధ్వంసక షాట్లతో క్లాసెన్ విరుచుకుపడ్డాడు. దాంతో.. భారత బౌలర్లు నిరాశలో పడిపోయాడు. ఫీల్డర్లు కూడా అతని మెరుపు బ్యాటింగ్‌లో డీలాపడ్డారు. టీవీ ఉందుకు కూర్చుకున్న అభిమానులది కూడా ఇదే పరిస్థితి. అప్పుడే హార్దిక్‌ పాండ్యా అందరికీ ఆశలకు జీవం పోశాడు. 17వ ఓవర్‌లో ప్రమాదకర క్లాసెన్‌ను 52 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔట్ చేశాడు. అంతేకాదు.. తన ఓవర్‌లో 4 పరుగులుమాత్రమే ఇచ్చాడు. దాంతో.. అందరిలో ఆశలు మళ్లీ మొలకెత్తాయి. అప్పుడొచ్చాడు ఆపద్బాంధవుడు బుమ్రా. తన ఆఖరి ఓవర్లో అదరహో అనిపించాడు. ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి యాన్సెన్‌ను ఔట్‌ చేసి తనకూ అవకాశముందని భారత్‌కు బలమైన నమ్మకం కలిగించాడు. ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. ఆ తర్వాత బాధ్యత అర్ష్‌దీప్‌ (19వ ఓవర్‌) తీసుకున్నాడు. శక్తులన్నీ కూడగట్టుకుని బ్యాటర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. వరుసగా 0, 0, 1, 2, 1, 0 పరుగులే ఇచ్చాడు.

ఇక్కడ సూర్య మరో హీరో. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అతడు అందుకున్న క్యాచ్‌కు మిల్లర్‌ నిష్క్రమించడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది.సిక్స్‌ వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్‌ వద్ద అతడు కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. ఈ క్యాచ్‌ అభిమానుల మనసులో చాన్నాళ్లు ఉండిపోతుంది.

హార్దిక్‌ తర్వాతి బౌంతికి బౌండరీ ఇవ్వగా.. మూడు, నాలుగు బంతులకు బైలు వచ్చాయి. హార్దిక్‌ వైడ్‌ వేసినా.. ఆ వెంటనే రబాడను ఔట్‌ చేయడంతో భారత్‌ విజయం ఖాయమైపోయింది. ఆఖరి బంతి పడగానే భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు మిన్నంటాయి.

ఈ మ్యాచ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. చివర్లో అద్భుతంగా రాణించి కప్‌ను అందుకున్నారు టీమిండియా ఆటగాళ్లని చెప్పారు. టీ20 ప్రపంచ కప్‌ను సగర్వంగా దేశానికి తీసుకువస్తుందన్నారు. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడుతున్నారని పేర్కొన్నారు.

Next Story