క‌ప్పు ఎవ‌రిదో..? పైన‌ల్‌లో ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్‌ ఢీ

T20 World Cup 2022 Final Who Will Win The Match Between Pakistan And England.ఇంగ్లాండ్‌, పాకిస్తాన్ లు ఫైన‌ల్‌లో అమీతుమీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2022 6:18 AM GMT
క‌ప్పు ఎవ‌రిదో..?  పైన‌ల్‌లో ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్‌ ఢీ

దాదాపు నెల రోజులకు పైగా క్రికెట్ అభిమానుల‌ను అల‌రించిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నెల క్రితం ఎవ్వ‌రూ ఊహించ‌ని రెండు జ‌ట్ల మ‌ధ్య టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఆదివారం ఎంసీజీలో ఇంగ్లాండ్‌, పాకిస్తాన్ లు ఫైన‌ల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో రెండు జ‌ట్ల ప్ర‌యాణాన్ని బ‌ట్టి చూస్తే ఫైన‌ల్‌ పోరు ఆస‌క్తిక‌రంగా జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే.. వాన దేవుడు మ్యాచ్‌ను స‌జావుగా సాగ‌నిస్తాడా..? లేదో చూడాలి.

పాకిస్థాన్‌.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో భారత్‌, జింబాబ్వే చేతిలో ఓడి ఇంటిబాట పట్టేలా క‌నిపించింది. అయితే.. ఆ త‌రువాత పుంజుకుంది. అదృష్టం కూడా తోడు కావ‌డంతో ముందంజ‌ వేసింది. ప్ర‌త్య‌ర్థి దుర్భేద్యంగా క‌నిపిస్తున్నా చ‌రిత్ర మాత్రం పాక్‌కు ఉత్సాహాన్నిఇస్తుంద‌డంలో సందేహం లేదు. 1992 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇలాగే పాకిస్తాన్ ఆశ‌లు లేని స్థితి నుంచి ముందంజ వేసి విశ్వ‌విజేత‌గా నిలిచింది. అప్పుడు సైమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌, ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించ‌గా.. తాజాగా సెమీ వ‌ర‌కు అదే క‌థ పున‌రావృతమైంది. మ‌రీ తుది పోరులోనూ అలాగే జ‌ర‌గాల‌ని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు.

నిల‌క‌డ‌లేమికి పెట్టింది పేరు పాకిస్తాన్‌. ఏ రోజున ఎలాగ ఆడుతారో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. షాహీన్‌ షా అఫ్రిది, మహమ్మద్‌ వసీమ్‌, హరీస్‌ రవూఫ్‌, నసీమ్‌ షాతో కూడిన పాక్‌ పేస్‌ దళంతో ఇంగ్లాండ్ కు క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఫామ్‌లేమితో స‌త‌మ‌త‌మవుతున్న పాక్ ఓపెన‌ర్లు బాబ‌ర్ ఆజామ్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌లు సెమీస్‌లో ఫామ్ అందుకోవ‌డం ఆ జ‌ట్టుకు ఆనందాన్ని ఇచ్చే విష‌యం.

జోరుమీదున్న బ‌ట్ల‌ర్ సేన‌..

బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా భీక‌రంగా క‌నిపిస్తోంది ఇంగ్లాండ్ జ‌ట్టు. సెమీస్‌లో భార‌త జ‌ట్టును ప‌ది వికెట్ల తేడాతో ఓడించి రెట్టింపు విశ్వాసంతో ఫైన‌ల్‌పోరుకు సిద్ద‌మైంది బ‌ట్ల‌ర్ సేన‌. పదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల వాళ్లు ఉండటం ఇంగ్లాండ్‌కు కలిసి రానుంది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్ ల‌తో పాటు మలన్‌, స్టోక్స్‌, బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, మోయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ వోక్స్‌ల‌తో కూడిన‌ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంతో బ‌లంగా క‌నిపిస్తోంది.

స్టోక్స్‌, మోయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, వోక్స్‌ రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లు ఉండ‌డం ఇంగ్లాండ్ కు అతి పెద్ద బ‌లం. ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో సామ్‌క‌ర‌ణ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండ‌డం ఆ జ‌ట్టుకు క‌లిసివ‌చ్చే అంశం. ఇక పాక్ ఓపెన‌ర్ల‌ను ఎంత త్వ‌ర‌గా పెవిలియ‌న్‌కు చేరిస్తే ఇంగ్లాండ్‌కు విజ‌యావ‌శాకాలు అంత మెరుగ్గా ఉంటాయి.

మెల్‌బోర్న్‌ పిచ్‌ పేస్‌, బౌన్స్‌కు సహకరించనుంది. కుదురుకుంటే మంచి స్కోరు సాధించ‌వ‌చ్చు. ఇక మ్యాచ్‌ రోజుకు వ‌రుణుడి ముప్పు పొంచి ఉంది. ఒక‌వేళ ఈరోజు ఆట సాధ్యం కాక‌పోతే రేపు(సోమ‌వారం) రిజ‌ర్వ్ డే అందుబాటులో ఉంది. అయితే.. రిజ‌ర్వ్ డే రోజు కూడా వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో కూడా ఆట సాధ్యం కాక‌పోతే ఇరు జ‌ట్లు ట్రోఫీని పంచుకుంటాయి.

Next Story
Share it