ఫైన‌ల్‌లో అడుగు పెట్టేది ఎవ‌రిదో..? పాక్‌, కివీస్ సెమీఫైన‌ల్ నేడే

T20 World Cup 2022 1st Semi Final match Between New Zealand and Pakistan today.సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 12:41 PM IST
ఫైన‌ల్‌లో అడుగు పెట్టేది ఎవ‌రిదో..?  పాక్‌, కివీస్ సెమీఫైన‌ల్ నేడే

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 టోర్నీ చివ‌రి అంకానికి చేరుకుంది. నేడు(బుధ‌వారం) జ‌రిగే తొలి సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. చ‌క్క‌టి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటూ గ్రూప్ టాప‌ర్‌గా కివీస్ సెమీస్‌లో అడుగుపెట్ట‌గా.. చ‌చ్చీ చెడీ, అదృష్టం తోడై అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్‌కు చేరింది. చూడ‌డానికి న్యూజిలాండ్ ఫేవ‌రెట్‌గా క‌నిపిస్తున్నా కూడా అంచ‌నాల‌కు అంద‌ని పాక్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలులేదు. దీంతో మ‌రో హోరాహోరీ పోరు ఖాయంగా క‌నిపిస్తోంది.

ప్ర‌పంచ‌క‌ప్ లాంటి మేజ‌ర్ టోర్నీల్లో న్యూజిలాండ్ నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న చేసినా.. పెద్ద మ్యాచుల్లో ఆ జ‌ట్టు త‌డ‌బాటు తెలియ‌నిది కాదు. గ‌త నాలుగు ప్ర‌పంచ‌క‌ప్‌ల్లోనూ(టీ20, వ‌న్డే) సెమీఫైన‌ల్ చేరిన ఆ జ‌ట్టు ఒక్క‌సారిగా క‌ప్పు సాధించ‌లేక‌పోయింది. గ‌త ఏడు సంవ‌త్స‌రాల కాలంలో మూడు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ (2015, 2019 వన్డేల్లో, 2021 టీ20)లో ఓడింది. దీంతో క‌నీసం ఈ సారి అయినా క‌ప్పును ముద్దాడాల‌ని ఆ జ‌ట్టు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. త‌మ‌కు అనుకూలించే ప‌రిస్థితుల్లో స‌త్తా చాటాల‌ని బావిస్తోంది.

డేవాన్ కాన్వే, అలెన్‌, విలియమ్సన్‌, ఫిలిప్స్‌, మిషెల్‌, నీషమ్‌ రూపంలో న్యూజిలాండ్‌కు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ అందుబాటులో ఉంది. వీరిలో ఫిలిప్స్‌, కాన్వే లు అద్భుత ఫామ్‌లో ఉండ‌గా.. గ‌త మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ మామ కూడా ఫామ్‌లోకి రావ‌డం కివీస్‌కు ఆనందాన్ని ఇచ్చే అంశం. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. సౌథీ, బౌల్ట్ కూడిన పేస్ ధ్వ‌యాన్ని ఎదుర్కొన‌డం పాక్ బ్యాట‌ర్ల‌కు అంత సులువు కాదు. వీరితో పాటు ఫెర్గూస‌న్ కూడా అందుబాటులో ఉన్నాడు. శాంట్నర్‌, సోధి స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు.

బౌలర్ల అండతో..

ఉప ఖండ జ‌ట్టే అయిన‌ప్ప‌టికి పేస్ బౌలర్ల‌కు పెట్టింది పేరు పాకిస్థాన్‌. త‌న పేస్ బ‌లాన్నే న‌మ్ముకుంది. షాహీన్‌ షా అఫ్రిది, హరీస్‌ రవుఫ్‌, నసీమ్‌ షా త్ర‌యం జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. వీరికి ఇటీవ‌ల స్పిన్నర్ల స‌హ‌కారం అందించ‌డంతో సెమీస్ వ‌ర‌కు వ‌చ్చింది. కెప్టెన్‌ బాబర్ ఆజామ్‌, స్టార్‌ ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్ ల ఫామ్ పాక్ మేనేజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ముఖ్యంగా బాబ‌ర్ త‌న స్థాయికి త‌గ్గ ఆట ఆడి చాలా రోజులైంది. వీరిద్ద‌రు ఈ మ్యాచ్‌లో అద్భుత ఆరంభాన్ని ఇవ్వాల‌ని ఆశిస్తోంది. వీరిలో పాటు మిడిలార్డర్‌లో షాన్‌ మసూద్‌, ఇఫ్తిఖార్‌ అహ్మద్‌, మహమ్మద్‌ నవాజ్ లు రాణిస్తే మిగిలిన ప‌నిని బౌల‌ర్లు చూసుకుంటారు.

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మూడుసార్లు ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌ జరుగగా.. మూడింట్లోనూ పాకిస్థాన్‌నే విజయం వరించింది. మ‌రీ ఈ సారి అయినా..చ‌రిత్ర‌ను బ్రేక్ చేసి కివీస్ ఫైన‌ల్‌లో అడుగుపెడుతుందో లేదో చూడాలి.

పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం..

సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ టోర్నీలో ఇక్క‌డ ఆరు మ్యాచులు జ‌రుగ‌గా ఐదు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టే గెలిచింది. బుధ‌వారం పోరులో కూడా టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉంది. మ్యాచ్‌కు వ‌రుణుడి ముప్పు లేదు. అయితే.. ఉద‌యం తేలిక పాటి జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంది.

Next Story