మరో ప్రతీకారం కోసం పాక్ ఆరాటం.. కివీస్‌తో పోరు నేడే
T20 World Cup 2021 match between Pakistan and New Zealand Today.యూఏఈ వేదికగా ప్రారంభమైన టీ 20 ప్రపంచకప్‌లో
By తోట వంశీ కుమార్ Published on 26 Oct 2021 3:47 PM ISTయూఏఈ వేదికగా ప్రారంభమైన టీ 20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు అంచనాలకు అందడం లేదు. తాజాగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. షార్జా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్ అదే జోష్‌లో కివీస్‌పై గెలిచి గట్టి ప్రతీకారం తీర్చుకోవాలని బావిస్తోంది. గత నెలలో కివీస్ భద్రతా కారణాల దృష్ట్యా పాక్ టూర్‌ను రద్దు చేసుకుంది.
తొలి వన్డే ప్రారంభం కావడానికి కొన్నిగంటల ముందు సిరీస్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోయింది. దీంతో పాక్‌కు బోర్డుకు భారీగా నష్టం వాటిల్లడంతో పాటు అదే కారణాన్ని చూపి ఇంగ్లాండ్ టీమ్ కూడా పర్యటకు రాలేమని చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగిన తరువాత ఏ పెద్ద జట్టు కూడా ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. కివీస్ కారణంగా భారీ నష్టం వాటిల్లిందని.. ఇతర జట్లు కూడా రావడానికి ఇష్టం పడని నేపథ్యంలో ప్రపంచకప్‌లో కివీస్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పటికే ఆ జట్టు మాజీ ఆటగాళ్లు సూచించారు.
దీంతో ఈ మ్యాచ్‌పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో పాక్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 24 టీ 20 మ్యాచుల్లో తలపడగా.. పాక్ 14 సార్లు, కివీస్ 10 సార్లు విజయాన్ని సాధించాయి. బౌలింగ్‌లో షహీన్ షా అఫ్రీది కీలకం కానుండగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లు మరోసారి రాణిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు.