'ఇంగ్లాండ్ పని పట్టాలంటే ఆ అస్త్రం దిగాల్సిందే'.. గవాస్కర్ బోల్డ్ స్ట్రాటజీ

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య హై-వోల్టేజ్ సెమీఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వినియోగించుకునే తీరుపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By -  అంజి
Published on : 3 March 2026 2:14 PM IST

Jasprit Bumrah, Sunil Gavaskar, T20 World Cup Semifinal, India vs England, Powerplay Strategy, Jos Buttler, Phil Salt, Wankhede Stadium, Cricket News Telugu, Suryakumar Yadav

'ఇంగ్లాండ్ పని పట్టాలంటే ఆ అస్త్రం దిగాల్సిందే'.. గవాస్కర్ బోల్డ్ స్ట్రాటజీ

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య హై-వోల్టేజ్ సెమీఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వినియోగించుకునే తీరుపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా బుమ్రా 5వ ఓవర్లో బౌలింగ్‌కు వస్తుంటాడు, కానీ ఇంగ్లాండ్‌పై మాత్రం ఆయనను మొదటి ఆరు ఓవర్లలో (పవర్‌ప్లే) కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయించాలని గవాస్కర్ సూచించారు.

ఎందుకు పవర్‌ప్లేలోనే?

గవాస్కర్ విశ్లేషణ ప్రకారం.. బుమ్రా 5వ ఓవర్లో వచ్చే సమయానికి ఇంగ్లాండ్ ఓపెనర్లు అప్పటికే సుమారు 20 బంతులు ఎదుర్కొని క్రీజులో కుదురుకుంటారు. "జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లు సెటిల్ అవ్వకముందే వారిని బుమ్రా ఎదుర్కోవాలి. వారు క్రీజులోకి వచ్చిన వెంటనే బుమ్రా బంతులేస్తే వికెట్లు పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం ఖాయం," అని గవాస్కర్ పేర్కొన్నారు.

అగాసీ, బెక్కర్ ఉదాహరణతో బుమ్రా విశ్లేషణ

బుమ్రా ఎందుకు అంత ప్రమాదకరమైన బౌలరో వివరిస్తూ గవాస్కర్ ఒక ఆసక్తికరమైన పోలికను చెప్పారు. టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగాసీ తన ఆత్మకథలో బోరిస్ బెక్కర్ సర్వీస్‌ను ఎలా కనిపెట్టాడో రాసుకున్న విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశారు. బెక్కర్ బంతిని విసిరేటప్పుడు తన నాలుకను ఎటువైపు ఉంచుతాడో చూసి, ఆయన సర్వ్ ఎటు వస్తుందో అగాసీ పసిగట్టేవాడట.

కానీ, బుమ్రా విషయంలో బ్యాటర్లకు అటువంటి ఎటువంటి క్లూ (Clue) దొరకదని గవాస్కర్ అన్నారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్, బంతిని వదిలే తీరు చాలా విభిన్నంగా ఉంటుందని, బంతి లోపలికి వస్తుందో లేక బయటకి వెళ్తుందో ఊహించడం అసాధ్యమని ఆయన కొనియాడారు.

ఈ టోర్నీలో బుమ్రా పవర్‌ప్లేలో బౌలింగ్ చేసిన ఐదు మ్యాచుల్లో 4 వికెట్లు తీశాడు. అయితే, ఆయనకు ఒక ఓవర్ కంటే ఎక్కువ అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ వంటి పటిష్ట జట్టుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గవాస్కర్ సలహాను పాటిస్తారో లేదో చూడాలి.

Next Story