టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త ఆట.. 15 పరుగులకే ఆలౌట్

Sydney Thunder Bowled Out For 15 Runs In Big Bash League.సిడ్నీ థండ‌ర్స్ జ‌ట్టు ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2022 8:59 AM GMT
టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త ఆట.. 15 పరుగులకే ఆలౌట్

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) త‌రువాత అత్యంత ప్ర‌జాద‌ర‌ణ బిగ్‌బాష్ లీగ్ సొంతం. తాజాగా ఈ టోర్నీలో సిడ్నీ థండ‌ర్స్ జ‌ట్టు ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది. ప‌ర‌మ చెత్త ఆట‌తో టీ20ల్లో చ‌రిత్ర‌లోనే అత్య‌ల్ప స్కోరును న‌మోదు చేసింది. శుక్ర‌వారం అడిలైట్ స్ట్రైక‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండ‌ర్స్ జ‌ట్టు కేవ‌లం 15 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండు అంకెల స్కోర్ చేయ‌లేక‌పోయాడు. టీమ్ మొత్తం చేసిన 15 ప‌రుగుల్లో ఎక్స్‌ట్రాల రూపంలో 3 ప‌రుగులు రావ‌డం గ‌మ‌నార్హం.

టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైక‌ర్స్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బౌల‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తుండ‌డంతో బ్యాట‌ర్లు బ్యాట్ ఝుళిపించ‌లేక‌పోరు. దీంతో అడిలైట్ స్ట్రైక‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు న‌ష్ట‌పోయి 139 ప‌రుగులు చేసింది. క్రిస్ లిన్ (36), కాలిన్ డి గ్రాండ్‌హోం (33) లు రాణించారు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన సిడ్నీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఆడింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (0), మాథ్యూ గిల్క్స్ (0) ఇద్దరూ డకౌట్ అయ్యారు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన‌ రైలీ రూసో (3) విఫ‌లం అయ్యాడు. వ‌చ్చిన బ్యాట‌ర్లు వ‌చ్చిన‌ట్లే పెవిలియ‌న్ కు చేరుకున్నారు. ప‌వ‌ర్ ప్లే కూడా పూర్తి కాకుండానే 5.5 ఓవ‌ర్ల‌లోనే సిడ్ని 15 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బిగ్ బాష్ లీగ్ సీనియర్ డివిజన్లో ఇంత తక్కువ స్కోరుకు ఒక జట్టు ఆలౌట్ అవడం ఇదే తొలిసారి. 17 బంతులు వేసి 3 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టిన అడిలైడ్ పేస‌ర్ హెన్నీ థార్ట‌న్ సిడ్నీ ప‌త‌నంలో కీల‌క పాత్ర పోషించాడు. దీనిపై సిడ్నీ అభిమానులు మండిప‌డుతున్నారు. మ‌రీ ఇంత చెత్త ఆటేమిట్రా బాబు అంటూ తిట్టిపోస్తున్నారు.

Next Story
Share it