పోరాడిన భారత బ్యాట్స్‌మెన్లు.. మ్యాచ్ డ్రా.. పంత్ సెంచరీ మిస్
Sydney test draw. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసి.. మ్యాచ్ ను డ్రా ముగించింది.
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2021 7:19 AM GMTచివరి రోజు భారత్ విజయానికి 90 ఓవర్లలో 309 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కెప్టెన్ అజింక్య రహానే(4) పెవిలియన్ చేరాడు. ఈ దశలో విజయం గురించి ఆలోచించడం అంటే కాస్త కష్టమే అనిపించింది. ఈ దశలో యువ ఆటగాడు రిషబ్ పంత్(97; 118 బంతుల్లో 12 పోర్లు, 3 సిక్సర్లు) వన్డే తరహాలో బ్యాటింగ్ చేయగా.. అతడికి నయా వాల్ పుజారా(77; 205 బంతుల్లో 12 పోర్లు) చక్కని సహకారం అందించాడు. దీంతో లక్ష్యం కరిగిపోతూ వచ్చింది. ఓ దశలో భారత్ గెలుస్తుందని భావించగా.. పంత్ ఔట్ కావడంతో ఆశలకు బ్రేకులు పడ్డాయి. మరికొద్ది సేపటికే పుజారా కూడా పెవిలియన్ చేరడంతో.. భారత్‌కు ఓటమి తప్పేలా లేదని అభిమానులు భావించారు. ఈ దశలో తెలుగు ఆటగాడు హనుమ విహారీ, స్పిన్నర్ అశ్విన్ గొప్ప పోరాడమే చేశారు.ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసి.. మ్యాచ్ ను డ్రా ముగించింది.
అంతముందు ఓవర్‌నైట్ స్కోర్ 98/2 సోమవారం ఐదో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓవర్ నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు జోడించకుండానే కెప్టెన్ రహానే.. నాధన్ లియోన్ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో మ్యాచ్ బాధ్యతలను పుజారా, రిషబ్ పంత్ భుజాన వేసుకున్నారు. పంత్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేయగా.. మరో ఎండ్ లో పుజారా వికెట్ పడకుండా అడ్డుగోడలా నిలుచున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 148 పరుగులు జోడించారు. పంత్ బ్యాటింగ్ చూస్తుంటే.. భారత్ విజయం సాధించేలా కనిపించింది. 97 పరుగులు చేసిన పంత్ ఓ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో 250 పరుగుల వద్ద టీమ్ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది.
పంత్ ఔట్ కావడంతో డ్రానే లక్ష్యంగా భారత బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేశారు. కొద్ది సేపటికే పుజారాను హెజిల్‌వుడ్ బోల్డ్ చేయడంతో.. మ్యాచ్‌లో ఉత్కంఠ ఏర్పడింది. మరో 40 ఓవర్లు ఆడాల్సి ఉండగా.. విహారి(23; 161 బంతుల్లో 4 పోర్లు) మాత్రమే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. గాయంతో రవీంద్ర జడేజా ఆడడం అనుమానమే. మరో వికెట్ పడితే.. మ్యాచ్ ఈజీగా ఆసీస్ చేతిలో వెళ్లేదే. అయితే.. ఈ దశలో తెలుగు ఆటగాడు హనుమ విహారి, అశ్విన్(39; 128 బంతుల్లో 7 పోర్లు)లు గట్టి పట్టుదల ప్రదర్శించారు. బంతిని ఢిపెండ్ చేయడమే లక్ష్యంగా ఆడారు. ముఖ్యంగా విహారి అయితే.. పరుగులు తీయడమే పక్కన పెట్టాడు. ప్రతి బంతికి డిఫెన్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వీరిద్దరి బాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయారు. వీరిద్దరు అభేధ్యమైన ఆరో వికెట్ 62 పరుగులు జత చేశారు. అందుకోసం వీరిద్దరు కలిసి 258 బంతులను ఎదుర్కొన్నారు. పలితంగా మ్యాచ్ డ్రా ముగిసింది.