గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రాణిస్తాడా.? ఆ జట్టు బలాలు, బలహీనతలు ఇవే..!
IPL 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టాయి.
By Medi Samrat Published on 18 March 2024 6:15 PM ISTIPL 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని లాగేసుకున్న ముంబై హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది.
హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుండి నిష్క్రమించిన తర్వాత శుభ్‌మన్ గిల్‌కు జట్టు కెప్టెన్సీ ఇచ్చారు. దీంతో ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. అటువంటి పరిస్థితితులలో గుజరాత్ టైటాన్స్ బలహీనతలు, బలాలను తెలుసుకుందాం.
గుజరాత్ టైటాన్స్ బలాలు
జట్టులోకి రానున్న కేన్ విలియమ్సన్
ఐపీఎల్ 2024కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులోకి బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన కేన్ విలియమ్సన్ మొదటి మ్యాచ్‌లోనే గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అయితే ఈ సీజన్‌లో విలియమ్సన్ తిరిగిరానున్నాడు. అయితే అతడు బ్యాటింగ్ ఫామ్ కోసం శ్రమిస్తున్నాడు. కేన్ పునరాగమనం గుజరాత్ టైటాన్స్‌ను బలోపేతం అవుతందని భావిస్తున్నారు.
హిట్టర్లకు వేదిక టైటాన్స్..
గుజరాత్ టైటాన్స్‌లో చాలా మంది బలమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వారు ఎలాంటి బౌలింగ్ ఆర్డర్‌నైనా నాశనం చేయడంలో ప్రవీణులు. మిల్లర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్‌లపై గుజరాత్ టైటాన్స్ ఆధారపడి ఉంటుంది. శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు. వీరితో పాటు.. గుజరాత్‌లో రషీద్ ఖాన్, విజయ్ శంకర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఆల్ రౌండర్‌లుగా ఉన్నారు, వీరు బంతి, బ్యాటింగ్ రెండింటిలోనూ ముఖ్యమైన సహకారాన్ని అందించగలరు.
ఫినిషర్ పాత్రలో షారుక్ ఖాన్
పంజాబ్ కింగ్స్ నుంచి విడుదలైన తర్వాత షారుక్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.7.4 కోట్లకు కొనుగోలు చేసింది. హార్దిక్ గైర్హాజరీలో షారుక్ ఖాన్ మిడిల్ ఆర్డర్‌లో హిట్టింగ్ బాధ్యతలు తీసుకుంటాడని యాజమాన్యం భావిస్తుంది.
గుజరాత్ టైటాన్స్ బలహీనతలు..
మహమ్మద్ షమీ లేకపోవడం..
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. షమీ టోర్నీకి దూరమవడం ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ కు పెద్ద లోటుగా భావించవచ్చు. షమీతో పాటు.. హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబిన్ మింజ్ నిష్క్రమణ
షమీ తర్వాత రాబిన్ మింజ్ రూపంలో గుజరాత్ టైటాన్స్‌కు రెండో దెబ్బ తగిలింది. రాంచీలో రాబిన్ మింజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు, దాని కారణంగా అతను IPL 2024 నుండి తప్పుకున్నాడు. ఇది కూడా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.