3 నెలల్లో 12 కిలోలు బరువు తగ్గిన క్రికెటర్.. ఎలా అంటే..?
Surya kumar yadav says he lost 12 kgs weight in 3 months.లాక్‌డౌన్ కాలంలో కేవలం 3 నెలల్లోనే 12 కిలోలు తగ్గానని భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్
By తోట వంశీ కుమార్ Published on 16 March 2021 4:46 PM IST
లాక్‌డౌన్ కాలంలో కేవలం 3 నెలల్లోనే 12 కిలోలు తగ్గానని భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన సూర్యకుమార్.. ముంబై ఐదోసారి కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గతకొంత కాలంగా ఐపీఎల్, రంజీల్లో నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్ భారత జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరగ్రేటం చేశాడు. అయితే.. ఇషాన్ కిషన్, కోహ్లీ, పంత్ ల బ్యాటింగ్‌తో సూర్యకుమార్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో నేడు జరిగే మూడో మ్యాచ్‌లోనైనా సూర్యకు బ్యాటింగ్ అవకాశం వస్తుందో లేదో చూడాలి మరీ.
ఇటీవల సూర్య ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. క్రికెట్ పై ఉన్న ప్రేమ, ఇష్టం తనను నడిపిస్తున్నాయన్నాడు. ఫిట్‌గా మారడం అంత సులువు కాదు. అలాగని అసాధ్యమూ కాదు. కాస్త కష్టపడితే సాధించవచ్చునని చెప్పాడు. లాక్‌డౌన్ మొదట్లో అన్ని రకాల ఆహారం తిన్నానని చెప్పాడు. లాక్‌డౌన్ సమయాన్ని ఫిట్‌గా తయారయ్యేందుకు ఎందుకు ఉపయోగించుకోవద్దు? అన్న ఆలోచన వచ్చింది. అప్పట్నుంచి తీపి పదార్థాలు మానేశానని చెప్పుకొచ్చాడు. 'అన్నం, పిండి వంటకాలు 90 శాతం తగ్గించా. కార్బొహైడ్రేట్లకు స్వస్తి చెప్పా. జొన్న.. రాగి రొట్టెలు, పప్పు, ఆకు కూరలు, పనీర్ మాత్రమే తిన్నా. రోజూ రెండు సార్లు కసరత్తులు చేశా. గతంలో వారంలో అయిదుసార్లు కసరత్తులు చేసేవాడిని. ఆరంభంలో కొంచెం కష్టంగా అనిపించింది. రాత్రి 7.30 భోజనం చేసి.. 10.30 నుంచి 11 గంటల మధ్య పడుకునేవాడిని. మొదట్లో రాత్రిళ్లు బాగా ఆకలి వేసేది. తర్వాత అలవాటైందని' సూర్యకుమార్ చెప్పాడు. ఆ మూడు నెలల కాలంలో 12 కిలోలు తగ్గానన్నాడు.