ఫిఫాతో చర్చలు జరపండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

Supreme Court's direction to Central Govt on Under-17 Women's Football World Cup. అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని, ఇందుకు ఫిఫాతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి

By అంజి  Published on  18 Aug 2022 8:30 AM GMT
ఫిఫాతో చర్చలు జరపండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని, ఇందుకు ఫిఫాతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఏఐఎఫ్‌ఎఫ్ పై మంగ‌ళ‌వారం ఫిఫా సస్పెన్ష‌న్ వేటు వేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల (థర్డ్‌ పార్టీ) ప్రమేయం కారణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. త‌క్ష‌ణ‌మే త‌మ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యంపై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏక‌గ్రీవంగా తీర్మానించిన‌ట్లు తెలిపింది.

దీంతో ఈ సంవత్సరం అక్టోబర్‌ 11 నుంచి 30 వరకు జరగాల్సిన అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి భారత్‌లో నిర్వహించాలనుకోవడం లేదని కూడా ఫిఫా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యకు సంబంధించిన కేసులను వెంటనే విచారించాలని సుప్రీం కోర్టును కేంద్రప్రభుత్వం కోరింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ జేబీ పరిద్వాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ మొదలెట్టింది.

అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ భారత్‌లో నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం, సీఓఏ చర్చలు జరుపుతుందని, ఈ సందర్భంగా విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం సమావేశాలు జరుగుతున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. కాగా ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయట వర్గం జోక్యాన్ని ఉపేక్షించేది లేదని కోర్టు తేల్చిచెప్పింది.

Next Story