ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన చాలా ఘోరంగా ఉన్న సంగతి తెలిసిందే..! ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ సీజన్ మధ్యలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ ను నియమించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం శనివారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుండి తప్పించింది. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 2018-19 సీజన్ లో కేన్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే..! అప్పుడు జట్టును ప్లే ఆఫ్స్ కు తీసుకుని వెళ్ళాడు కేన్. అదే నమ్మకంతో ఈ సీజన్ లో కేన్ చేతుల్లోకి కెప్టెన్సీని పెట్టారు. 2016 సీజన్ లో వార్నర్ కెప్టెన్సీలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కప్ వచ్చింది.
2021 సీజన్ లో హైదరాబాద్ జట్టు ఘోరమైన ప్రదర్శన కనబరుస్తూ ఉంది. అటు బౌలింగ్, బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. కెప్టెన్ వార్నర్ కూడా తనదైన శైలిలో దూకుడుగా ఆడలేకపోతూ ఉన్నాడు. దీంతో వార్నర్ మీద ఉన్న భారాన్ని తగ్గించాలని హైదరాబాద్ జట్టు యాజమాన్యం భావించింది. అతడిని తప్పిస్తున్నట్లుగా ట్విట్టర్ లో పోస్టును పెట్టింది. ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో కేన్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.