వేలానికి ముందే సన్‌రైజర్స్ జట్టులోకి 'గచ్చిబౌలి దివాకర్'
Sunrisers Hyderabad chose Gachibowli Diwakar before IPL 2021 auction.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ కు అన్ని జట్లు సమాయత్తం అవుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2021 7:06 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ కు అన్ని జట్లు సమాయత్తం అవుతున్నాయి. ఫిబ్రవరి 18న నిర్వహించే మినీ వేలం కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్ల రిటైన్ లిస్టును ప్రకటించాయి. తమకు అవసరం లేని ఆటగాళ్లను వేలానికి విడిచిపెట్టాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ట్విట్టర్ వేదికగా.. ప్రాంచైజీలు చేసే ట్వీట్లు అభిమానులను అలరిస్తుంటాయి. కొన్ని సార్లు అవతలి ఫ్రాంచైజీలు సైతం ఫన్నీగా బదులు ఇస్తుంటాయి. వేలానికి సమయం దగ్గర పడుతుండడంతో.. రాజస్థాన్ రాయల్స్ చేసిన ఓ ట్వీట్‌కు సన్‌రైజర్స్ అంతే ఫన్నీగా బదులు ఇచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ ఓ నలుగురి ఫొటోలను ట్వీట్ చేసి ఇందులో ఎవరినైనా ఎంచుకోవాలని క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ ట్వీట్‌లో లగాన్ చిత్రంలో ఆమిర్ ఖాన్, తారక్ మెహతా కా ఉల్టా చష్మా నటుడు దిలీప్ జోషి (జెఠాలాల్) మరో ఇద్దరు సినిమా క్రికెటర్లు ఉన్నారు. అయితే ఈ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తనదైన శైలిలో బదులిచ్చింది. 'మేం మా క్రికెటర్‌ను ఎంపిక చేసుకున్నాం' అంటూ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం జిఫ్ ఫైల్‌ను పోస్ట్ చేసింది.
We've picked ours 😎 https://t.co/D9mzymol3E pic.twitter.com/magzY6Qjeh
— SunRisers Hyderabad (@SunRisers) February 3, 2021
'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో గచ్చిబౌలి దివాకర్‌గా బ్రహ్మీ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆ చిత్రంలో టీమ్ఇండియాకు వీరాభిమాని బ్రహ్మనందం కనిపిస్తాడు. క్రికెట్ ఆడడం రాకపోయినా కూడా.. ఇండియన్ టీమ్‌ను తానే గెలిపించినట్లు చెబుతూ స్వీట్లు పంచుతుంటాడు. ఆ చిత్రంలోని ఫైల్‌నే షేర్ చేసిన సన్‌రైజర్స్.. మా జట్టులోకి గచ్చి బౌలి దివాకర్‌ను తీసుకున్నామని చెప్పకనే చెప్పి రాజస్థాన్‌కు పంచ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మినీ వేలం కోసం 22 మందిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్.. కేవలం ఐదుగురి ప్లేయర్లనే వదిలేసుకుంది.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, నటరాజన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమాద్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి, షాబాజ్ నదీమ్, సిద్దార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్
వదులుకున్న ఆటగాళ్లు: బిల్లీ స్టాన్లేక్, ఫాబియాన్ అలెన్, ఎస్ యాదవ్, బావనక సందీప్, యర్ర పృథ్వీరాజ్