ఎనిమిదేళ్లుగా పదిలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌టైమ్ రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అద్బుతంగా రాణించింది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 5:57 AM GMTఎనిమిదేళ్లుగా పదిలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌టైమ్ రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అద్బుతంగా రాణించింది. రికార్డులను క్రియేట్ చేసింది. ఫైనల్ వరకూ వచ్చినా.. చివరి మ్యాచ్‌లో విఫలం కావడంతో రన్నరప్‌గా మిగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుంది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 2016లో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలుగు జట్టు చరిత్రను లిఖించింది. సన్‌రైజర్స్ సాధించిన రికార్డును ఇప్పటికీ ఏ జట్టూ బ్రేక్ చేయలేదు.
2016 సీజన్‌లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై 22 పరుగుల తేడాతో నెగ్గింది. క్వాలిఫయర్-2కి ఎంపిక అయ్యింది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన హైదరాబాద్ టీమ్ కీలక మ్యాచ్‌లో మాత్రం చెలరేగింది. ఆ తర్వాత క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ లయన్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలబడింది హైదరాబాద్. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 8 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. వార్నర్ 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 209 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది ఆర్‌సీబీ.
ఇద్దరు ఓపెనర్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అద్భుత ఆరంబాన్ని ఇచ్చారు. గేల్ 38 బంతుల్లో 76 పరుగులు, కోహ్లీ 35 బంతుల్లో 54 పరుగులు కొట్టారు. ఒకానొక దశలో ఆర్సీబీ విజయానికి 44 బంతుల్లో 68 పరుగులు అవసరం అయ్యాయి. చేతిలో తొమ్మి వికెట్లు ఉన్నాయి. దాంతో.. బెంగళూరే టైటిల్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే ఎస్‌ఆర్‌హెచ్ అద్భుతంగా పుంజుకుంది. గొప్పగా పోరాడి ట్రోఫీని గెలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. మరే జట్టు ఇప్పటి వరకు వరుసగా ఎలిమినేటర్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచుల్లో వరుగా గెలిచి కప్‌ను అందుకోలేదు. గత ఎనిమిదేళ్లుగా ఈ హైదరాబాద్ రికార్డు పదిలంగానే ఉంది.