బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టును నడిపించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటనలో వెల్లడించాడు. ‘వన్డే సిరీస్ కోసం ప్యాట్ కమిన్స్ భారత్ రావడం లేదు. అతను ఇంటి వద్దనే ఉండనున్నాడు. ప్రస్తుతం కష్ట సమయంలో ఉన్న కమిన్స్ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం’ అని మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటనలో తెలిపాడు. కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ మూడో టెస్టులో ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ లో జట్టును గెలిపించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది.
భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. మార్చి 17న ముంబైలో తొలి వన్డే ప్రారంభం కానుంది. మార్చి 19న విశాఖపట్నంలో రెండో వన్డే ఉంది. ఆఖరి వన్డే మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది.