ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా కమిన్స్.. 55 ఏళ్ల తరువాత తొలిసారి
Pat Cummins appointed Australia’s new Test captain.ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా
By తోట వంశీ కుమార్ Published on 26 Nov 2021 9:40 AM GMT
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని తెలిపింది. దీంతో డిసెంబర్ 8 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌లో కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగనుంది.
సహచర ఉద్యోగికి అసభ్యకరమైన సందేశాలు పంపాడని తేలడంతో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీకి టిమ్‌పైన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, ఫాస్ట్ బౌలర్ కమిన్స్ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే.. ఇద్దరిలో ఎవరిని కెప్టెన్‌గా నియమించాలనే దానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఐదుగురితో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఇంటర్య్వూలు చేసి మరీ పాట్ కమిన్స్‌ను ఆసీస్ టెస్టు జట్టుకు 47వ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కాగా.. 1957 తరువాత ఆస్ట్రేలియా జట్టుకు ఓ ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి.
తనను కెప్టెన్‌గా ఎంపిక చేయడం పట్ల కమిన్స్ స్పందించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు గౌరవప్రదమని చెప్పాడు. జట్టులో ఉన్న సీనియర్లు, జూనియర్లతో కలిసి ముందుకు సాగుతానన్నాడు. కాగా.. మాజీ కెప్టెన్ టిమ్‌పైన్ యాషెస్ సిరీస్‌లో ఆడడం అనుమానమే.