బ్రేకింగ్‌.. అత్యాచారం కేసులో శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక అరెస్ట్‌

Sri Lanka cricketer Danushka Gunathilaka arrested in Sydney.శ్రీలంక క్రికెట‌ర్ దనుష్క గుణతిలకను పోలీసులు అరెస్ట్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 3:57 AM GMT
బ్రేకింగ్‌.. అత్యాచారం కేసులో శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక అరెస్ట్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 టోర్నీ జ‌రుగుతున్న స‌మ‌యంలో సంచ‌లన ఘ‌ట‌న చోటు చేసుకుంది. శ్రీలంక క్రికెట‌ర్ దనుష్క గుణతిలకను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో అత‌డిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌పంచ‌క క‌ప్ టోర్నీలో సెమీస్ చేర‌కుండానే నిష్క్ర‌మించిన శ్రీలంక.. తాజాగా గుణ‌తిల‌క లేకుండానే స్వ‌దేశానికి బ‌య‌లుదేరింది.

ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో న‌మీబియా చేతిలో ఓడిన శ్రీలంక జ‌ట్టులో గుణ‌తిల‌క స‌భ్యుడిగా ఉన్నాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో అత‌డు గాయ‌ప‌డి జ‌ట్టుకు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో అషెన్ బండార జట్టులో చేరిన‌ప్ప‌టికి లంక జ‌ట్టు మాత్రం అత‌డిని స్వ‌దేశానికి పంప‌కుండా జ‌ట్టుతో పాటే ఉంచుకుంది.

ఓ డేటింగ్ యాప్ ద్వారా దనుష్క గుణ‌తిల‌క‌కు ప‌రిచ‌య‌మైన 29 ఏళ్ల సిడ్నీ మ‌హిళ‌.. త‌న‌పై గుణ‌తిల‌క లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేసింది. న‌వంబ‌ర్‌2న‌ సిడ్నీలోని ఓ నివాసంలో ఈ ఘటన జరిగింద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో సిడ్నీలోని టీమ్‌హోట‌ల్ నుంచి ఆదివారం తెల్ల‌వారుజామున అత‌డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.

న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వారి వెబ్‌సైట్‌లో పేరులేని శ్రీలంక జాతీయుడిని అరెస్టు చేయడం గురించి కూడా ప్రస్తావించారు."గత వారం సిడ్నీ తూర్పు ప్రాంతంలో ఒక మహిళపై జరిగిన లైంగిక వేధింపులపై విచారణ జరిపిన తర్వాత సెక్స్ క్రైమ్స్ స్క్వాడ్ డిటెక్టివ్‌లు శ్రీలంక జాతీయుడిపై అభియోగాలు మోపారు" అని నివేదిక పేర్కొంది.

కాగా.. గుణ‌తిల‌క‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ స్వ‌దేశంలో ఓ నార్వే అమ్మాయి గుణ‌తిల‌క‌తో పాటు అత‌డి స్నేహితుడిపై అత్యాచార ఆరోప‌ణ‌లు చేసింది. అయితే.. ఆ కేసు నుంచి అత‌డు బ‌య‌ట‌ప‌డ్డాడు.

లంక త‌రుపున 100కు పైగా అంత‌ర్జాతీయ మ్యాచుల్లో గుణ‌తిల‌క ఆడాడు. ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్‌లో లంక జ‌ట్టు కీల‌క స‌భ్యుడిగా ఉన్నాడు. అయితే.. త‌ర‌చుగా గాయాల పాలు అవుతూ జ‌ట్టుకు దూరం అవుతూ ఉన్నాడు.

Next Story