షనుక తుఫాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక
Sri Lanka Achieve Massive Record In Dramatic Win Over Australia In 3rd T20I.లంక జట్టు టీ20ల్లో అరుదైన రికార్డును
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2022 2:36 PM ISTలంక జట్టు టీ20ల్లో అరుదైన రికార్డును నెలకొల్పింది. లక్ష్య చేధనలో చివరి మూడు ఓవర్లలో 59 పరుగులు సాధించి ఓ రికార్డును తన పేరున లిఖించుకుంది. శనివారం రాత్రి పల్లెకలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో శ్రీలంక జట్టు సంచలన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 17 ఓవర్లు ముగిసేసరికి 118/6 స్కోరుతో నిలిచింది. లంక విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు చేయాలి. ఈ స్థితిలో లంక గెలుస్తుందని ఎవ్వరూ ఉహించి ఉండరు.
అయితే.. ఈ దశలో లంక కెప్టెన్ దసున్ షనక (54 నాటౌట్; 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. హేజిల్‌వుడ్ వేసిన18వ ఓవర్ లో రెండు సిక్సులు, రెండు పోర్లు బాది 20 పరుగులు సాధించాడు. అనంతరం 19వ ఓవర్‌లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 10 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్‌లో విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతుల్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో విజయ సమీకరణం 4 బంతుల్లో 15 పరుగులుగా మారింది. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. ఆ సమయంలో శనక వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదడంతో చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే అవసరం కాగా.. రిచర్డ్ సన్ ఆఖరి బంతిని వైడ్‌గా వేయడంతో లంక గెలిచింది. దీంతో చేధనలో చివరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగుల్ని సాధించిన జట్టుగా లంక రికార్డును సాధించింది.
అంతకముందు ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ 39, స్టొయినిస్ 38, స్మిత్ 37 నాటౌట్ రాణించారు.