చ‌తికిలప‌డ్డ ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ మ్యాచ్‌లో 56 పరుగులకే ఆలౌట్‌

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on  27 Jun 2024 7:37 AM IST
చ‌తికిలప‌డ్డ ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ మ్యాచ్‌లో 56 పరుగులకే ఆలౌట్‌

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరుగుతున్న సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన‌ ఆఫ్ఘనిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 11.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి కేవ‌లం 56 పరుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టులో అజ్మతుల్లా ఉమర్జాయ్ (10) మినహా ఏ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. 12వ ఓవర్ ఐదో బంతికి ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆలౌట్ అయింది. తబ్రైజ్ షమ్సీ నవీన్-ఉల్-హక్‌(2)ను అవుట్ చేయ‌డంతో ఆ జ‌ట్టు ఇన్నింగ్సు ముగిసింది. ఆఫ్ఘనిస్థాన్ జ‌ట్టులో న‌లుగురు బ్యాట్స్‌మెన్ కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గా.. మ‌రో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సున్నా ప‌రుగుల‌కు అవుట‌య్యారు. దక్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో జాన్సన్, ష‌మ్సీ చెరో మూడు, ర‌బాడా, నొకియా చెరో రెండు చొప్పున వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక‌ తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో సెమీస్ చేరిన‌ ఆఫ్ఘనిస్థాన్ ఈ మ్యాచ్‌లో గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అంతా భావించారు.. కానీ చ‌తికిల ప‌డింది.

Next Story