ఐసీసీ వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ దుమ్ము దులపడంతో 400 పరుగుల మార్కు దాటింది ఆ జట్టు స్కోరు. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ వాన్ డెర్ డుస్సెన్ సెంచరీలు బాదారు. డికాక్ 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వాన్ డెర్ డుస్సెన్ 110 బంతుల్లో 108 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత మార్ క్రమ్ 49 బంతుల్లోనే.. వంద పరుగులు చేశాడు. ప్రపంచ కప్ చరిత్రలోనే 49 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు మార్ క్రమ్. 49 బంతులు ఎదుర్కొన్న మార్ క్రమ్ 14 ఫోర్లు, మూడు సిక్సులు కొట్టాడు. 54 బంతుల్లో 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు మార్ క్రమ్. క్లాసెన్ 32, మిల్లర్ 39 పరుగులు చేశారు.