భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం ఆయనకు యాంజియో ప్లాస్టీ చేయాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. కరోనా సమయంలో కూడా ఐపీఎల్ ను నిర్వహించి తన సత్తా చాటాడు. ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న యువకులకు భారతజట్టులో అవకాశాలు దక్కేలా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా గంగూలీకి ఛాతీలో నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారని సన్నిహితులు చెప్పుకొచ్చారు. దీంతో ఆయనను ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించగా గుండెపోటుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం డాక్టర్ సరోజ్ మోండల్ పర్యవేక్షణలో సౌరవ్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. సాయంత్రం సౌరవ్‌కు యాంజియో ప్లాస్టీ చేయనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు క్రికెటర్లు కూడా దాదా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ ఉన్నారు.