బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా పదవీకాలంపై క్లారిటీ అన్నదే రాకుండా పోతోంది. బీసీసీఐ రాజ్యాంగానికి పలు సవరణలు చేయాలని కోరుతూ బీసీసీఐ పిటిషన్ వేయగా.. ఆ పిటీషన్ సుప్రీంకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది. అప్పటిదాకా బాధ్యతలను వీరే తీసుకోనున్నారు. బీసీసీఐ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. గంగూలీ, జై షాతో పాటు జాయింట్ సెక్రటరీ జయేశ్ జార్జ్ పదవీకాలం కొన్ని నెలల కిందటే ముగియగా.. స్టేట్ అసోసియేషన్, బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేళ్లు పదవిలో ఉన్న ఈ ముగ్గురూ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం కచ్చితంగా మూడేళ్ల విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) తీసుకోవాల్సి ఉంటుంది.
కూలింగ్ ఆఫ్ నిబంధన సహా బీసీసీఐ రాజ్యాంగంలో పలు సవరణలు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ బోర్డు ట్రెజరర్ అరుణ్ ధూమల్ ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న విచారణను సుప్రీం బెంచ్ బుధవారం తమ జాబితాలో చేర్చడంతో గంగూలీ, జై షా భవితవ్యంపై ఉత్కంఠ వీడే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. ఈ కేసును జనవరి మూడో వారంలో విచారణ జాబితాలో చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో డిసెంబర్ 24న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో గంగూలీ పాల్గొనవచ్చు. గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌కు జై షా, జయేశ్ కూడా హాజరుకానున్నారు.