రహానే సంచలన వ్యాఖ్యలు.. 'నిర్ణయాలు నావి.. క్రెడిట్ మరొకరిది'
Someone else took credit for my decisions in Australia says Ajinkya Rahane.గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2022 11:06 AM ISTగతేడాది ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ఇండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది టీమ్ఇండియా. ఆ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి రాగా.. స్టార్ ఆటగాళ్లు లేకున్నా యువ ఆటగాళ్లతో కలిసి రహానే ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయాలను అందించాడు. మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో కదంతొక్కి జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. అయితే.. తాజాగా నాటి విజయం పై రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ విజయానికి తన నిర్ణయాలు కారణమైతే.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని విమర్శించాడు.
రహానే పేరు చెప్పకపోయానా.. అప్పటి టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రిపై రహానే పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఆనాటి విజయంతో అప్పటి కోచ్ రవిశాస్త్రిని మీడియా ఆకాశానికెత్తేసింది. ఆస్ట్రేలియాలో ఏం చేశానో తనకు తెలుసు అని.. దాని గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని రహానే అన్నాడు. మరొకరి ఘనతను తీసుకునే స్వభావం తనది కాదన్నాడు. మైదానంలో, డ్రెస్సింగ్ రూంలో కొన్ని విషయాలపై తాను నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవమని. అయితే.. మరొకరు ఆ ఘనతను తీసుకున్నారు. కాగా.. సిరీస్ గెలిచామన్నదే తనకు ముఖ్యమని. అదో చరిత్రాత్మక సిరీస్ అని రహానే చెప్పుకొచ్చాడు.
'అది నేనే చేశాను.. ఫలానా మలుపుకు నేనే కారణం' అని వేరొకరు గొప్పగా చెప్పుకున్నారని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం తన ఫామ్‌పై వస్తున్న విమర్శలపైనా రహానే స్పందించాడు. తన పనైపోయిందని కొందరు చేసే కామెంట్లు చూస్తుంటే తనకు నవ్వొస్తుందన్నాడు. క్రికెట్ పరిజ్ఞానం ఉన్న వాళ్లు ఎవరూ అలా మాట్లాడరన్నాడు. తనపై సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందన్నాడు. తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని రహానే చెప్పుకొచ్చాడు.
ఇక రానున్న రంజీ ట్రోఫీలో ముంబై తరఫున పృథ్వీ షా కెప్టెన్సీలో రహానే ఆడబోతున్నాడు. రంజీ ట్రోఫీలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడితేనే వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు రహానే ఎంపిక అవుతాడు.