సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సెంచరీ చేసింది.

By Medi Samrat  Published on  16 Jun 2024 6:39 PM IST
సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సెంచరీ చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో, మంధాన 116 బంతుల్లో తన ODI కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించింది.

99 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మంధాన ఇన్నింగ్స్ కారణంగా 265 పరుగులు చేసింది. మంధాన 127 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 117 పరుగులు చేసింది. మంధాన ఇన్నింగ్స్‌తో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. షెఫాలీ వర్మ ఏడు పరుగులు, హేమలత 12 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 10 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 17 పరుగులు, వికెట్ కీపర్ రిచా ఘోష్ మూడు పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత దీప్తి శర్మతో కలిసి మంధాన ఆరో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 48 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 37 పరుగులు చేసి దీప్తి ఔటైంది. ఆ తర్వాత మంధాన ఏడో వికెట్‌కు పూజా వస్త్రాకర్‌తో కలిసి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఎట్టకేలకు మంధాన మసాబాటా క్లాస్ కెప్టెన్ సునే లూయస్ చేతికి చిక్కింది.

మంధాన 117 పరుగులు చేసింది. పూజా 42 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 31 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడింది. దక్షిణాఫ్రికా తరఫున అయబొంగా ఖాకా మూడు వికెట్లు తీయగా.. మసాబత్ క్లాస్ రెండు వికెట్లు పడగొట్టింది. అనెరి డెర్క్‌సెన్, నొనుకులులెకో మలాబా, నొందుమిసో షాంగసేలకు ఒక్కో వికెట్ దక్కింది.

Next Story