ఆస్ట్రేలియాలో భారతజట్టు చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకుంది. టెస్ట్ సిరీస్ లో ఎంతో మంది ఆటగాళ్లను గాయాలు వెంటాడాయి. సీనియర్ బౌలర్లు అందరూ ఒక్కొక్కరిగా సిరీస్ నుండి తప్పుకోవడంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ బౌలింగ్ యూనిట్ మీద ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఈ సిరీస్ లోనే టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన సిరాజ్ భారత బౌలింగ్ యూనిట్ కు నాయకుడిలా నడిచాడు. కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి ఆసీస్ బ్యాట్స్మెన్ ను ఎలా కట్టడి చేయాలో ప్రణాళికలు రచించి విజయంలో భాగమయ్యాడు.
ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ మంచి బౌలింగ్ ప్రదర్శనను చేశాడు. సిరాజ్ కూడా హైదరాబాద్ కు చేరుకున్నాడు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే సిరాజ్ తండ్రి సమాధి వద్దకు వెళ్లి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. తనను జాతీయ క్రికెటర్ గా చూడాలనుకున్న తండ్రికి నివాళులు అర్పించాడు. తండ్రి సమాధిపై పువ్వులు ఉంచి, దైవ ప్రార్ధనలు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ సిరీస్ మొహమ్మద్ సిరాజ్ కు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. ఆస్ట్రేలియా పర్యటన ఆరంభంలోనే సిరాజ్ తండ్రిని కోల్పోయాడు. కానీ క్వారెంటైన్ నిబంధనలు, ఆస్ట్రేలియాలో చాలా దూరంగా ఉండడం లాంటి కారణాల వలన సిరాజ్ తండ్రిని కడసారి చూసుకోడానికి రాలేకపోయాడు. తన కొడుకు జాతీయ జట్టుకు ఆడాలన్నది సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కల. కొన్నిరోజుల కిందట గౌస్ అనారోగ్యంతో మరణించారు. తన కొడుకును భారత టెస్ట్ జట్టులో చూడకుండానే ప్రాణాలను వదిలాడు గౌస్. సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో కొనసాగాడు. జాతీయగీతం వచ్చే సమయంలో సిరాజ్ ఎమోషనల్ అవుతూ.. బాధపడుతూ ఉండడం కూడా క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోతోంది.