ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టిన జైస్వాల్, సిరాజ్, ప్రసిద్ధ్‌.. గిల్‌కు షాక్‌..!

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ తర్వాత ICC మళ్లీ తాజా ర్యాంకింగ్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

By Medi Samrat
Published on : 6 Aug 2025 3:06 PM IST

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టిన జైస్వాల్, సిరాజ్, ప్రసిద్ధ్‌.. గిల్‌కు షాక్‌..!

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ తర్వాత ICC మళ్లీ తాజా ర్యాంకింగ్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ మార్పు కనిపించింది. టీమ్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పురుషుల టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో టాప్-5లోకి మళ్లీ ప్రవేశించగా, భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వెన‌క‌ప‌డ్డాడు. నాలుగు స్థానాలు దిగ‌జారి ర్యాంక్ నుంచి 13వ స్థానానికి ప‌డిపోయాడు.

అదే సమయంలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇంగ్లండ్ టూర్‌లో వారి అద్భుతమైన ప్రదర్శనతో భారీ లాభాలను పొందారు. ఇద్దరూ తమ కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను సాధించారు. ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత, ఐసీసీ ర్యాంకింగ్స్ అప్‌డేట్‌లో భారత ఆటగాళ్లు భారీ ప్రయోజనం పొందారు.

ఓవల్ టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ పురుషుల టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతని సహచరుడు ప్రసిద్ధ్ కృష్ణ 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఓవల్ టెస్టులో మొత్తం 8 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్, కృష్ణ ఇద్దరూ టెస్టుల్లో తమ అత్యుత్తమ ర్యాంకింగ్స్ సాధించడం ఇదే తొలిసారి.

ఇంగ్లండ్ పేసర్లు గుస్ అట్కిన్సన్, జోష్ టంగ్ కూడా కెరీర్‌లో అత్యుత్తమ స్థానాలను సాధించారు. ఓవల్‌లో భారత్‌పై ఇద్దరూ చెరో 8 వికెట్లు తీశారు. గుస్ తొలిసారిగా టాప్-10లోకి ప్రవేశించగా, జోష్ 14 స్థానాలు ఎగబాకి 46వ స్థానానికి చేరుకున్నాడు.

ఓవల్‌లో సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ పురుషుల బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 3 స్థానాలు ఎగబాకి టాప్-5లోకి మళ్లీ ప్రవేశించాడు. అతనికి 792 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ పురుషుల బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో జో రూట్, హ్యారీ బ్రూక్ వరుసగా మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నారు. అదే సమయంలో జింబాబ్వే-న్యూజిలాండ్ సిరీస్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత డారిల్ మిచెల్ ICC బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలను పొంది టాప్-10లోకి ప్రవేశించాడు. .

Next Story