అదరగొట్టిన భారత బ్యాటర్లు.. న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే..?
Shreyas Iyer's 80 helps IND post 306/7 in 50 overs. తొలి వన్డేలో భారత బ్యాటర్లు అదరగొట్టారు.
By తోట వంశీ కుమార్ Published on 25 Nov 2022 11:19 AM ISTమూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముందు 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(72; 77 బంతుల్లో 13 ఫోర్లు), శుభ్‌మన్ గిల్(50; 65 బంతుల్లో 1ఫోర్, 3 సిక్స్‌లు) లతో పాటు శ్రేయస్ అయ్యర్(80; 76 బంతుల్లో4ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థశతకాలతో అలరించారు. అయితే.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్(37నాటౌట్; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టాడు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టీమ్ సౌథీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా ఆడమ్ మిల్నే ఓ వికెట్ తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్‌లు తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్థశతకాలు సాధించిన తరువాత ఓపెనర్లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆ తరువాత వచ్చిన పంత్ (15), సూర్యకుమార్ యాదవ్(4)లను ఒకే ఓవర్‌లో ఫెర్గూసన్ ఔట్ చేసి భారత్‌కు గట్టి షాకిచ్చాడు. దీంతో భారత్ 33 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న శ్రేయస్‌కు సంజు శాంసన్(36; 38 బంతుల్లో 4 ఫోర్లు) జత కలిశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ధాటిగా ఆడడంతో భారత్ 300 పరుగులు చేసింది.