టీమ్ఇండియాకు పెద్ద షాక్..5 నెలలు ఆటకు దూరం కానున్న శ్రేయాస్ అయ్యర్..!
వెన్నుగాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ డబ్ల్యూటీసి ఫైనల్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 3:00 PM ISTశ్రేయాస్ అయ్యర్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. వెన్నుగాయంతో బాధపడుతున్న భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ డబ్ల్యూటీసి ఫైనల్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెన్నుగాయానికి శ్రస్త చికిత్స చేయించుకోవాల్సి ఉండడంతో ఐదు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. దీంతో ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసి ఫైనల్‌కు దూరం అవ్వనున్నాడు.
గతకొంతకాలంగా అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది. దీంతో ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి వైద్యులు సర్జరీ అవసరం అని సూచించినట్లు సమాచారం. దీంతో లండన్‌లో సర్జరీ చేయించుకోవాలని అయ్యర్ బావిస్తున్నాడు.
శస్త్ర చికిత్స అనంతరం అతడు ఐదు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ సమయానికి అయ్యర్ కోలుకునే అవకాశం ఉంది.
కోల్‌కతా కెప్టెన్ ఎవరో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వెన్నుగాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రేయాస్ దూరం కానున్న నేపథ్యంలో ఇప్పుడు కోల్‌కతాకు ఎవరు సారథ్యం వహిస్తారు అన్న చర్చ మొదలైంది. ఐపీఎల్ ప్రారంభానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో కొత్త కెప్టెన్ వేటలో పడింది జట్టు మేనేజ్‌మెంట్. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త కెప్టెన్ ఎవరు అనేది కోల్‌కతా వెల్లడించనుంది.