భారత జట్టుకు మరో షాక్.. అతడు కూడా దూరం.!
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 9 Feb 2024 9:43 AM GMTఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వలన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. తర్వాతి టెస్ట్ లకు విరాట్ వస్తాడా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. భారత జట్టులో మరో ఆటగాడు గాయపడ్డాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా.. వచ్చే వారం జరుగనున్న రాజ్‌కోట్ టెస్ట్‌కు గైర్హాజరయ్యే అవకాశం ఉందని MCA మూలాలు తెలిపాయి.అతని ఫిట్‌నెస్ స్థితి గురించి నేషనల్ క్రికెట్ అకాడమీ బీసీసీఐకి లేఖ రాసిందని తెలుస్తోంది. మిగిలిన టెస్ట్ మ్యాచ్ లకు జట్టును సెలెక్ట్ చేయడానికి.. సెలెక్టర్లు ఫిబ్రవరి 8 నాడు సమావేశమవుతారని భావించారు. అయితే ఇంకా సమావేశం జరగలేదు.
ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే గాయాలతో కేఎల్ రాహుల్, జడేజా జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు టాపార్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీపు నొప్పి, గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ లో జరగనుంది. రాజ్ కోట్ మ్యాచ్ లోనే కాదు, మిగతా రెండు టెస్టుల్లోనూ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగా మారింది. రెండో టెస్టు ముగిశాక శ్రేయాస్ అయ్యర్ కిట్ ను అతడి స్వస్థలం ముంబయికి తరలించారు. గాయం తీవ్రత దృష్ట్యా శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండబోవడంలేదని తెలుస్తోంది. ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును ఇంగ్లండ్ గెలవగా, రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది.