చెత్త కెప్టెన్.. ఆడింది చాలు.. వచ్చేయండి
Shoaib Akhtar Slams Pakistan After World Cup Defeat To Zimbabwe.పాకిస్తాన్ ఆటతీరుపై ఆ దేశంలో సర్వత్రా విమర్శలు
By తోట వంశీ కుమార్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ ఆటతీరుపై ఆ దేశంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తొలి మ్యాచ్‌లో బలమైన టీమ్ఇండియా చేతిలో ఓటమి పాలు కాగా.. గురువారం జింబాబ్వే చేతిలో ఓడిపోవడంలో పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. దీంతో అభిమానులతో పాటు మాజీలు.. ఆటగాళ్ల తీరుపై విరుచుకుపడుతున్నారు.
ముఖ్యంగా జింబాబ్వే చేతిలో బాబర్ సేన ఓటమి పాలవ్వడంపై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ... బాబర్ అజామ్ కెప్టెన్సీపై మండిపడ్డాడు. "ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. మన జట్టు టాప్, మిడిల్ ఆర్డర్ తో మనం పెద్ద విజయాలు సాధించగలం. అయితే.. వీరిలో నిలకడ లేదు. సరైన కెప్టెన్ కూడా లేకపోవడంతో పాక్ ప్రపంచకప్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. మనం ఓడిన మ్యాచుల్లో నవాజ్ చివరి ఓవర్‌ను వేశాడని" అక్తర్ చెప్పాడు.
"ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో బాబర్ వన్‌డౌన్‌లో రావాలి. కెప్టెన్సీ, మేనేజ్‌మెంట్ నిర్ణయాల్లో ప్రధాన లోపాలు ఉన్నాయి. పవర్ ప్లే అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చే ఓపెనర్లు అవసరం ఉంది. ఫఖర్ జమాన్‌ను కేవలం బెంచ్‌కే పరిమితం చేశారు. షాహీన్ షా అఫ్రీది ఫిట్‌నెస్ సాధిచలేదు. అయినప్పటికి అతడిని ఆడిస్తున్నారు. అతడు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటికైనా మేనేజ్‌మెంట్‌కు జ్ఞానోదయం అవుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు" అని అక్తర్ అన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. స్వల్ప స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ పాక్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.