క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. దుబాయ్ వేదికగా ఈ రోజు రాత్రి 7.30గంటలకు హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక ప్రపంచకప్‌లలో భారత జట్టును ఇంత వరకు పాక్ ఓడించలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా మూడు సలహాలు ఇచ్చాడు.
మొదటిది.. భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలని 2. కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించకుండా చూడాలని 3. మెంటార్ ధోనిని బ్యాటింగ్ రాకుండా అడ్డుకోవాలన్నాడు. ఎందుకంటే ధోని ఇప్పటికీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ కామెడీగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
అనంతరం సీరియస్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టు మంచి ఆరంభం కోసం చూడాలని సూచించాడు. తొలి 5 నుంచి 6 ఓవర్ల పాటు బంతికి ఓ పరుగు చేసినా సరే డాట్ బాల్స్ లేకుండా చూసుకోవాలన్నాడు. అనంతరం విరుచుకుపడాలని పాక్ బ్యాట్స్‌మెన్లకు సలహా ఇచ్చాడు. ఇక బౌలర్లు వికెట్ల కోసం ప్రయత్నించాలని.. భారత జట్టును వీలైనంత తక్కువ పరుగులకే పరిమితం చేయాలన్నాడు.