నిన్న మ్యాచ్ గెలిపించాడు.. నేడు జ‌ట్టును వీడి స్వ‌దేశానికి

Shimron Hetmyer leaves Rajasthan Royals camp to travel back to Guyana.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2022 11:08 AM GMT
నిన్న మ్యాచ్ గెలిపించాడు.. నేడు జ‌ట్టును వీడి స్వ‌దేశానికి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో మ్యాచులు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. టైటిల్ ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగిన జ‌ట్లు పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానాల్లో కొన‌సాగుతుండ‌గా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు మాత్రం అంచనాల‌కు మించి రాణిస్తోంది. ఇక ఆ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న వెస్టిండీస్ స్టార్ ఆట‌గాడు షిమ్రోన్‌ హెట్‌మెయర్‌ అర్థాంత‌రంగా జ‌ట్టును వీడాడు. ఆదివారం ఉద‌యం అత‌డు జ‌ట్టును వీడి త‌న స్వ‌స్థ‌లం గయానాకి బ‌య‌లుదేరాడు.

ఈ విష‌యం తెలిసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ సీజ‌న్‌లో తొలిసారి చేజింగ్‌లో శ‌నివారం పంజాబ్‌పై రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది. 190 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన రాయల్స్‌ను షిమ్రోన్‌ హెట్‌మెయర్‌ తన హిట్టింగ్‌తో గెలిపించాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లు బాది 31ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు మ‌రుపురాని విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్‌కు మ‌రింత చేరువైంది. ఇలాంటి త‌రుణంలో హెట్‌మైర్ జ‌ట్టును వీడ‌డం ఏంట‌ని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

కాగా.. షిమ్రోన్‌ హెట్‌మెయర్‌ త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే జ‌ట్టును వీడాడ‌ని, వ‌చ్చే వారం జ‌ట్టుతో క‌లుస్తాడ‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. హెట్‌మెయర్‌ భార్య నిర్వాణి నిండు గ‌ర్భిణి. ఆమె ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. ఈ స‌మ‌యంలో త‌న భార్య ప‌క్క‌నే ఉండాల‌ని హెట్‌మెయర్ బావించాడు. ఈ విష‌యాన్ని రాజ‌స్థాన్ మేనేజ్‌మెంట్‌ తెలుప‌గా.. అందుకు ఫ్రాంచైజీ అనుమతించడంతో హెట్‌మెయర్‌ ఆదివారం ఉదయం తన స్వస్థలమైన గయానాకు బయలుదేరాడు.

ఈ సందర్భంగా హెట్‌మైర్ జ‌ట్టును వీడుతున్న వీడియోనూ రాజస్తాన్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ''జీవితంలో పిల్లలు పుట్టే మధురక్షణం ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు నాకు అది కలిగింది. నా బిడ్డను చూడాలనే తాపత్రయంతో ఎమర్జెన్సీ పేరుతో స్వదేశానికి వెళుతున్నా. రాజస్తాన్‌ రాయల్స్‌ డ్రెసింగ్‌ రూమ్‌లో నా జ్ఞాపకాలు ఉంటాయి. నన్ను మిస్‌ అవుతున్నానని అనుకోవద్దు.. తొందరలోనే మళ్లీ కలుస్తా'' అంటూ ఆ వీడియోలో హెట్‌మైర్ తెలిపాడు.

Next Story
Share it