ప్లే ఆఫ్స్‌కు చేరనందుకు.. శిఖర్ ధావన్‌ను కొట్టిన తండ్రి.. వీడియో వైరల్
Shikhar Dhawan's father beating him after Punjab not get qualified into playoffs
By తోట వంశీ కుమార్ Published on 26 May 2022 3:29 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు. 14 మ్యాచుల్లో 460 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. అయినప్పటికీ అతడి జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. 14 మ్యాచులు ఆడిన పంజాబ్ 7 విజయాలు, 7 పరాజయాలు చవిచూసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న శిఖర్ ధావన్‌ను అతడి తండ్రి చితక్కొట్టాడు.
చేతులతో దెబ్బలు కొట్టడంతో పాటు కిందపడేసి కాళ్లతో తంతూ కసితీరా కొట్టాడు. ఈ వీడియోను ధావన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. దానికి ఓ పాత బాలీవుడ్ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ జత చేశాడు. అయితే.. ఇది ఫన్నీ వీడియో మాత్రమే. కాకపోతే ధావన్.. ఈ వీడియోను పోస్ట్ చేసి ప్లే ఆఫ్స్ చేరనందుకు తన తండ్రి ఇలా కొట్టాడు అని రాయడంతో వైరల్ గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
కాగా.. గతంలో కూడా శిఖర్ ధావన్ ఇదే తరహాలో రీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రీల్‌లో శిఖర్ ధావన్ తన తండ్రి ముందు సినిమా డైలాగ్ మాట్లాడాడు. అది విన్న ఆయన.. శిఖర్ను చెంప దెబ్బ కొడుతున్నట్లు నటించాడు. ఇందులో ధావన్ న్యాచురల్‌గా కనిపించడంతో పెద్దాయన సీరియస్‌గానే చేయి చేసుకున్నాడని చాలా మంది భ్రమ పడ్డారు. గబ్బర్ యాక్టింగ్ అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.