ధావన్ సరదా.. బోట్‌మెన్‌ను కష్టాల్లో పడేసింది
Shikhar Dhawan feeds birds in Varanasi. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన ఓ పని కారణంగా ఓ బోట్‌మెన్ కష్టాల్లో పడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2021 10:49 AM GMTఒకరి సరదా మరొకరికి శాపంగా మారకూడదు. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన ఓ పని కారణంగా ఓ బోట్‌మెన్ కష్టాల్లో పడ్డాడు. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న సమయంలో.. ధావన్ పడవలో విహరిస్తూ పక్షులకు ఆహారం వేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే.. శిఖర్ ధావన్ ఇటీవల వారణాసీ టూర్‌కి వెళ్లాడు. వారణాసీలో గంగా నదిపై పడద మీద వెళ్లిన ధావన్ పక్షులకి ఆహారాన్ని పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బర్డ్ ప్లూ నేపథ్యంలో పక్షులకు ఆహారాన్ని అందించటం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు ఇదే అతడికి కష్టాలు తెచ్చింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో పర్యాటకులు పక్షులకి ఎలాంటి ఆహరం పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ధావన్ రూల్స్ అతిక్రమించాడనే విషయం తెలిసింది. కాగా.. దీనిపై వారణాసి కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. పక్షులకు మేత వేసేందుకు అనుమతించిన బోట్‌మెన్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. పర్యటకుల మీద ఉండవని.. బోటు యజమానుల మీద ఉంటాయని చెప్పారు.
'బోట్‌మెన్స్‌కి ఇటీవల చాలా స్పష్టంగా పోలీసులు, అధికారులు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టూరిస్ట్‌లను పక్షులకి ఇచ్చే ఆహరంతో ప్రయాణానికి అనుమతించకూడదని చెప్పారు. ఎవరైనా ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే వారికి నోటీసులు జారీ చేసి.. మీ లైసెన్స్‌కి ఎందుకు రద్దు చేయకూడదో వివరణ అడుగుతాం. కానీ టూరిస్ట్‌లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోం' అని కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ చెప్పారు.
పర్యాటకులను అనుమతించిన బోట్‌మెన్‌పైనే చర్యలు తీసుకుంటామని, పర్యాటకులపై కాదని చెప్పడంతో ధావన్‌కు ముప్పు తప్పినట్లే.