రసకందాయంలో రెండో టెస్టు.. ఫామ్‌లో లేని ఆ ఇద్దరూ రాణిస్తేనే
Shardul Thakur's 7 wicket burst puts 2nd Test in the balance.వాండరర్స్ మైదానంలో శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన
By తోట వంశీ కుమార్
వాండరర్స్ మైదానంలో శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో చెలరేగిన అతను టీమ్ఇండియాను తిరిగి పోటిలో నిలిపాడు. దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం దక్కినా.. రెండో టెస్టు మాత్రం రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తీసివేయగా.. ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. పుజారా (35), రహానే (11) క్రీజ్‌లో ఉన్నారు. ఇక మూడో రోజు వీరిద్దరు ఎలా రాణిస్తారు అన్నదానిపైనే మ్యాచ్ ఆధార పడి ఉంది. ప్రస్తుతం పిచ్ ఉన్న పరిస్థితుల్లో 200 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించినా చేధించడం దక్షిణాఫ్రికాకు కష్టమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతముందు ఓవర్‌నైట్ స్కోర్ 35/1 తో రెండో రోజు ఆటకొనసాగించిన దక్షిణాఫ్రికా శార్దూల్ ఠాకూర్(7/61) ధాటికి 229 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్(62), తెంబా బవుమా(51) అర్థశతకాలతో రాణించగా మిగిలిన వారు విఫలం అయ్యాయి. అయినప్పటికీ దక్షిణాప్రికాకు 27 స్వల్ప అధిక్యం లభించింది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
ఫామ్‌లేని ఆ ఇద్దరిపైనే..
ప్రస్తుతం బ్యాటింగ్ భారమంతా సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానేలపైనే ఉంది. గతకొంతకాలంగా వీరిద్దరూ సరైన ఫామ్‌లో లేరు. జట్టులో వీరి పరిస్థితి ప్రశ్నార్థకమైన సంగతి తెలిసిందే. ఇదే చివరి అవకాశం అయ్యే పరిస్థితి ఉందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో వారిద్దరు ఎలా రాణిస్తారు అన్నదానిపైనే.. వారి క్రికెట్ కెరియర్లు కొనసాగడంతో పాటు సిరీస్ విజయం ఆధారపడి ఉంది. పిచ్‌పై అనూహ్యమైన బౌన్స్ లభిస్తుండడంతో భారత్ మరో 150 నుంచి 200 పరుగులు చేసి.. దక్షిణాఫ్రికా ముందు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశిస్తే సిరీస్ విజయం పై ఆశలు పెట్టుకోవచ్చునని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరీ కెరీర్‌కు కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా సీనియర్లు పుజారా, రహానేలు రాణిస్తారో లేదో చూడాలి మరీ.