గురువారం కరాచీలో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ వెటరన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది బౌలింగ్ ను ప్రత్యర్థి బ్యాటర్లు చితక్కొట్టారు. రిటైర్మెంట్ ప్రకటించినా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో ఆడుతూ ఉన్నాడు. అఫ్రిది తన నాలుగు ఓవర్లలో 67 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అతడు లైన్ అండ్ లెంత్ బంతులు వేసినా భారీ హిట్టింగ్ చేశారు. ఆజం ఖాన్ అఫ్రీది వేసిన ఆఖరి ఓవర్ లో పండగ చేసుకున్నాడు. అఫ్రిది తన స్పెల మొదటి మూడు ఓవర్లలో 47 పరుగులు ఇవ్వగా, అజామ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 20 పరుగులు పిండుకుని ఔటయ్యాడు. తన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అఫ్రిది వేగవంతమైన డెలివరీతో అజామ్‌ను అవుట్ చేసిన ఆనందాన్ని మాత్రమే దక్కించుకున్నాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీగా పరుగులు ఇచ్చేశాడు అఫ్రీది.
పాల్ స్టిర్లింగ్, కొలిన్ మున్రో, అజామ్ అర్ధసెంచరీలతో ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 229 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ నాలుగు ఓవర్లలో 2/32 ఇచ్చి మంచి బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. క్వెట్టా ఛేజింగ్ లో 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. అహ్సాన్ అలీ యాభై పరుగులు చేశాడు. నవాజ్ 47 పరుగులు చేశాడు. అఫ్రిది బ్యాటింగ్ లో కూడా నిరాశపరిచాడు, ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అఫ్రీది పెర్ఫార్మెన్స్ చూసి ఇక ఆడటం మానేయాలని క్వెట్టా అభిమానులు కోరుతూ ఉన్నారు.