టీ20 సిరీస్‌పై టీమ్ఇండియా క‌న్ను.. లంక‌తో రెండో టీ20 నేడే

Second T20 match between India and Sri Lanka today.పుణె వేదిక‌గా నేడు భార‌త్, శ్రీలంక జ‌ట్లు రెండో టీ20 మ్యాచ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 9:32 AM GMT
టీ20 సిరీస్‌పై టీమ్ఇండియా క‌న్ను.. లంక‌తో రెండో టీ20 నేడే

పుణె వేదిక‌గా నేడు భార‌త్, శ్రీలంక జ‌ట్లు రెండో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించిన టీమ్ఇండియా అదే ఊపును కొన‌సాగిస్తూ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని బావిస్తోండ‌గా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని శ్రీలంక గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో నేడు జ‌రిగే మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి.

సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న యువకులు స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది. తొలి మ్యాచ్‌లో విఫ‌లం అయిన శుభ్‌మ‌న్ గిల్ ఈ మ్యాచ్‌లో చెల‌రేగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అటు చాలా రోజుల త‌రువాత జ‌ట్టులోకి వ‌చ్చిన సంజు శాంస‌న్ కూడా అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోలేక‌పోయాడు. అత‌డు గాయంతో దూరం అవ‌డంతో రుతురాజ్ లేదా రాహుల్ త్రిపాఠిల్లో ఒక‌రికి తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌నుంది.

గ‌త కొంత‌కాలంగా భీక‌ర ఫామ్‌లో ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా తొలి మ్యాచ్‌లో విఫ‌లం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అత‌డి నుంచి 360 డిగ్రీ మెరుపుల‌ను ఆశిస్తున్నారు అభిమానులు. కెప్టెన్ హార్థిక్ పాండ్య‌తో పాటు ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్‌లు మ‌రోసారి రాణించాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. గాయంతో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేస‌ర్ అర్ష్ దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌పై వేటు ప‌డే అవ‌కాశం ఉంది. అరంగ్రేటం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్ల‌తో స‌త్తా చాటిన శివ‌మ్ మామి స్థానానికి డోకా లేదు. తొలి మ్యాచ్‌లో విఫ‌లం అయిన చాహ‌ల్ స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను ఆడిస్తారా..? లేదా చాహ‌ల్‌కు మ‌రో అవ‌కాశం ఇస్తారా..? అన్న‌ది చూడాల్సిందే.

అటు లంక కూడా తాము ఏ మాత్రం త‌క్కువ కాద‌ని చేత‌ల్లో చూపించింది. తొలి మ్యాచ్‌లో భార‌త్‌కు కాస్త అదృష్టం తోడై గెలిచింది గానీ లేదంటే లంక విజ‌యం సాధించేదే. స్పిన్న‌ర్లు హ‌స‌రంగ‌, తీక్ష‌ణ‌, ధ‌నుంజ‌లు భార‌త బ్యాట‌ర్ల‌ను బాగా ఇబ్బంది పెట్టారు. పుణె పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలిస్తుంద‌న్న అంచ‌నాల‌ నేప‌థ్యంలో వీరితో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. తొలి టీ20 విఫ‌లం అయిన నిశాంక‌, అస‌లంక‌, రాజ‌ప‌క్స‌తో పాటు కుశాల్ మెండీస్‌, కెప్టెన్ శాస‌న బ్యాటింగ్‌లో రాణిస్తే టీమ్ఇండియాకు తిప్ప‌లు త‌ప్ప‌వు.

Next Story
Share it